TG Parents Protection Bill : తల్లిదండ్రులను పట్టించుకోకపోతే జీతంలో కోత.. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారికి కూడా వర్తింపు
TG Parents Protection Bill : కన్న బిడ్డల నిరాదరణకు గురైన తల్లిదండ్రులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
telangana assembly approves parents protection bill 2026 cm revanth reddy comments
TG Parents Protection Bill : తెలంగాణ ప్రభుత్వం.. సంచలన నిర్ణయం తీసుకుంది. కని, పెంచి, పెద్ద చేసి ప్రయోజకులను చేసిన సంతానం.. చివరకు అవసాన దశలో ఉన్న తల్లిదండ్రులను అక్కున చేర్చుకుని వారికి పట్టెడన్నం పెట్టడానికి ముందుకు రావడం లేదు. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల వేతనంలో కోత విధించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అధికారికంగా ప్రకటన చేశారు.
‘తల్లిదండ్రుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కన్నవారిని పట్టించుకోని ఉద్యోగి జీతంలో 15 శాతం కోత విధిస్తాం. అలా కట్ చేసిన మొత్తాన్ని నేరుగా ఉద్యోగి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేసేలా చట్టాన్ని రూపొందించాం’ అని తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కడుపున పుట్టిన బిడ్డల బాగు కోసం.. కన్నవారు తమ శక్తినంతా ధారపోస్తారు. కానీ ఆ పిల్లలు మాత్రం రెక్కలు వచ్చాక తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు. అలా కన్న బిడ్డల నిరాదరణకు గురైన వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి సభలో వెల్లడించారు.
‘‘వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 20 ఏళ్ల క్రితమే అంటే.. 2007లో ఒక చట్టం తెచ్చింది. అయితే ఆ చట్టం ప్రకారం బాధిత తల్లిదండ్రులకు.. రూ.10 వేలు మాత్రమే వస్తాయి. నేటి కాలంలో కొందరు బిడ్డల ప్రవర్తన సమాజం తలదించుకునేలా ఉంది. ఆత్మీయతకు సంబంధించిన అంశంపై చట్టం తీసుకురావడం బాధాకరంగానే ఉన్నా.. ప్రస్తుత కాలంలో తప్పడం లేదు. తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోని వారిని సామాజికంగా బహిష్కరించాలి. ఈ చట్టం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాక.. ప్రజా ప్రతినిధులు, ప్రైవేటు ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది’’ అని తెలిపారు.
