KTR: బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్..? టీడీపీలో మంచి లక్షణాలున్నాయి, అందుకే మేము ఓడిపోయాం- చిట్‌చాట్‌లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కుటుంబసభ్యులను ఏడిపించేలా కవిత వ్యవహరిస్తున్నారని వాపోయారు. తల్లిదండ్రులకు మేలు చేయకపోయినా పర్లేదు కానీ వారిని బాధ పెట్టకూడదని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

  • Published On : April 12, 2026 / 07:35 PM IST

KTR: మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లిలో చిట్ చాట్ లో మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి నష్టపోయామన్నారు. మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారని, దీన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అన్నారు. ప్రజా సమస్యలపై త్వరలోనే పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్పారు. డీ లిమిటేషన్ తో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న కేటీఆర్.. ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధమే అన్నారు. పొత్తులు తమకు కలిసి రావని తేల్చి చెప్పారు.

ఇక బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు కేటీఆర్. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తమకు, ప్రజలకు మధ్య దూరం పెరిగిన మాట వాస్తవమే అన్న కేటీఆర్.. ఆ గ్యాప్ ను సరి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. ఇక తెలుగుదేశం పార్టీకి మంచి లక్షణాలు ఉన్నాయని మెచ్చుకున్నారు కేటీఆర్. ఆ పార్టీ నాయకుడు కార్యకర్తలతో నేరుగా మమేకం అవుతారని చెప్పుకొచ్చారు.

మా పార్టీలో అది లోపించిందని, అందుకే ఓడిపోయామని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. జైలుకి వెళితేనే సీఎం అవుతారు అన్నది భ్రమే అన్నారు. మరోవైపు కవిత వ్యవహారంపైనా స్పందించారు కేటీఆర్. కుటుంబసభ్యులను ఏడిపించేలా కవిత వ్యవహరిస్తున్నారని వాపోయారు. తల్లిదండ్రులకు మేలు చేయకపోయినా పర్లేదు కానీ వారిని బాధ పెట్టకూడదని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

Also Read: ఏటీఎంలలో పెట్టాల్సిన కోటి రూపాయలు మాయం.. సికింద్రాబాద్‌లో కలకలం

”రానున్న రోజులలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తా. 2027 నుండి పాదయాత్ర చేయడానికి ప్లాన్ చేస్తున్నా. డీలిమిటేషన్ వల్ల నియోజకవర్గాలు పెరుగుతున్న నేపథ్యంలో సిరిసిల్ల నుంచి కాకుండా పక్క స్థానంలో పోటీ చేయాల్సి రావొచ్చు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎమ్మెల్యేలను మారిస్తే అధికారంలోకి వచ్చే వాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలిసి పోటీ చెయ్యం. తెలుగుదేశం పార్టీలో మంచి లక్షణాలు ఉన్నాయి. పార్టీ నాయకుడు డైరెక్ట్ గా కార్యకర్తతో ఇంటరాక్ట్ అవుతాడు. మా బీఆర్ఎస్ పార్టీలో అది లోపించింది, కాబట్టే మేము ఓడిపోయాం. ఈసారి గెలిచే వాళ్లకు టిక్కెట్లు ఇస్తాం. జర్నలిస్టులకు మేము న్యాయం చేయలేదు అనేది వాస్తవం. మళ్ళీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు న్యాయం చేస్తాం. కుటుంబసభ్యులను ఏడిపించే విధంగా కవిత వ్యవహరిస్తోంది. ఇది చాలా బాధాకరం. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోము. పొత్తు పెట్టుకుంటే మాకు కలిసి రాదు” అని కేటీఆర్ అన్నారు.