Nadendla Bhaskar Rao: మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత..

Nadendla Bhaskar Rao Passes Away : మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 

Former Chief Minister Nadendla Bhaskara Rao Passes Away

Nadendla Bhaskar Rao Passes Away : మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కాంటినెంటల్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా.. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం నాదెండ్ల భాస్కరరావు తుదిశ్వాస విడించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అంతిమ నివాళులర్పించుకోవడానికి వీలుగా ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్ లోని వారి స్వగృహనందు ఉంచనున్నారు.

Also Read : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్.. చర్చలకు రండి.. చెడ్డ పేరు తేవాలని చూడొద్దు..

హైదరాబాద్ లోని పంజాగుట్టలోని హిందూ శ్మశానవాటికలో తన అంత్యక్రియలు నిర్వహించాలని నాదెండ్ల భాస్కరరావు గతంలో కుటుంబ సభ్యులకు సూచించారు. ఆయన ఆకాంక్ష మేరకు గురువారం (ఏప్రిల్ 23, 2026) మధ్యాహ్నం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న గుంటూరులో జన్మించారు. ఉస్మానియా యూనివర్శిటీలో లా గ్రాడ్యుయేషన్ చేశారు. 1978లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారి ఎన్నికయ్యారు. విజయవాడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాదెండ్ల భాస్కరరావుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపనలో ఎన్టీఆర్ తో కలిసి ఆయన కీలక పాత్ర పోషించారు.

1983లో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన కేబినెట్లో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, ఎన్టీఆర్ అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో కాంగ్రెస్ మద్దతుతో ఆయనను ముఖ్యమంత్రిగా నియమించారు. ఇది అప్పట్లో రాజకీయ దుమారం రేపింది. ఆ తరువాత ధర్మ యుద్ధం పేరిట పోరాటం చేసి ఎన్టీఆర్ తిరిగి అధికారం దక్కించుకున్నారు. 1984 ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు కేవలం 31రోజులు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు కొనసాగారు. రాష్ట్ర చరిత్రలో అతితక్కువ కాలం ముఖ్యమంత్రిగా నాదెండ్ల నిలిచారు.

ఎన్టీఆర్ కేబినెట్లోనేకాక.. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో భాస్కర్ రావు మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో నాదెండ్ల 1989లో తెనాలి నుంచి పోటీచేసి అన్నాబత్తుని సత్యనారాయణపై ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. 2019లో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు.

భాస్కర్ రావు మృతిపట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు.