LPG Gas cylinder Booking : బుక్ చేసినా గ్యాస్ సిలిండర్ డెలివరీ కాలేదా..? ఆలస్యం అవుతుందా.. వెంటనే ఇలా చేయండి.. మీ సమస్యకు సింపుల్ సొల్యూషన్
LPG Gas cylinder Booking : గ్యాస్ సిలిండర్ల డెలివరీలో అనవసర జాప్యం జరిగినా, ఎవరైనా సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా లేదా బ్లాక్ మార్కెట్ కు మళ్లించినా ప్రజలు వెంటనే పౌరసరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1967కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చునని అధికారులు తెలిపారు.
- Harishth Thanniru
- Published on- April 15, 2026 / 08:34 AM IST
LPG Gas cylinder Booking
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- గ్యాస్ సిలిండర్ బుక్ చేసినా డెలివరీ కాలేదా?
- 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి
LPG Gas cylinder Booking : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ, సీఎన్‌జీ గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు గ్యాస్ గోడౌన్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఇదే అదునుగా భావించి కొందరు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, మళ్లింపులు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం వేచి చూడాల్సి వస్తోంది. గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసి వారాలు గడుస్తున్నా గ్యాస్ సిలిండర్ డెలివరీ కాకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలకు తీసుకునేందుకు సిద్ధమైంది. గ్యాస్ సరఫరాలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
గ్యాస్ సిలిండర్ల డెలివరీలో అనవసర జాప్యం జరిగినా, ఎవరైనా సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా లేదా బ్లాక్ మార్కెట్ కు మళ్లించినా ప్రజలు వెంటనే పౌరసరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1967కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చునని అధికారులు తెలిపారు. గ్యాస్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ బుకింగ్‌లు, డెలివరీలను నిత్యం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
గ్యాస్ సిలిండర్ల పంపిణీలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. కావాలని గ్యాస్ డెలివరీలను ఆలస్యం చేస్తే లైసెన్సు రద్దు చేస్తామని, గ్యాస్ సిలిండర్లను అక్రమ మార్గాలకు మళ్లిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇదిలాఉంటే.. కొందరు ముఠాలుగా ఏర్పడి గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలించి అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విజిలెన్స్ బృందాలు జరిపిన సోదాల్లో 5,079 డొమెస్టిక్ సిలిండర్లు, 70 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1.5కోట్లు విలువైన సిలిండర్లను సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటి వరకు 2,089 కేసులు నమోదు చేసినట్లు, కఠి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేకాక.. సిలిండర్లపై నిర్ణీత ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
