Hyderabad : హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. సిటీ మధ్యలో నుంచి మరో పెద్ద ఫ్లై ఓవర్.. ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్!
Hyderabad : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా.. సిటీ మధ్యలో నుంచి మరో పెద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి కసరత్తు చేస్తోంది.
- Harishth Thanniru
- Published On : March 14, 2026 / 09:55 AM IST
Hyderabad
- జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం
- సిటీ మధ్యలో నుంచి పెద్ద ఫ్లైఓవర్
- ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు చర్యలు
Hyderabad : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణాలు చేపడుతోంది. తాజాగా.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సిటీ మధ్యలో నుంచి మరో పెద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి చర్యలు చేపడుతోంది.
బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ (ఐసీసీసీ) నుంచి రేతిబౌలి జంక్షన్‌లోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే వరకు అనుసంధానంగా మరో ఫ్లై ఓవర్ నిర్మించాలని జీహెచ్ఎంసీ ప్లాన్ చేస్తోంది. ఐసీసీసీ నుంచి ఫిల్మ్ నగర్, అపోలో ఆస్పత్రి, మల్కం చెరువు రోడ్డు వరకు, అక్కడి నుంచి టోలిచౌకి, నానల్ నగర్ మీదుగా రేతిబౌలి జంక్షన్ వద్దనున్న పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేకి కొత్త ఫ్లై ఓవర్‌ను లింక్ చేయాలని నిర్ణయించినట్లు.. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ని రూపొందించేదుకు జీహెచ్ఎంసీ చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది.
ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్కు మీదుగా ప్రయాణించే వారు ఎలాంటి సిగ్నల్స్ లేకుండా తక్కువ సమయంలో ఎయిర్ పోర్టుకు చేరుకోవచ్చు. ఇప్పటికే కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు అండర్ పాస్ లు, ఏడు స్టీల్ ఫ్లై ఓవర్ల నిర్మాణం పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. వీటికి ఐసీసీసీ – రేతిబౌలి ఫ్లైఓవర్ కూడా తోడైతే హైదరాబాద్ వెస్ట్ జోన్ ట్రాఫిక్ స్వరూపమే మారిపోనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
