Godavarikhani Woman Suicide Case : గోదావరిఖనిలో యువతి ఆత్మహత్య కేసులో షాకింగ్ ట్విస్ట్! ఫోన్‌లో లేఖ.. కారులో మందు.. పక్కా ప్లాన్‌తో..
Godavarikhani Woman Suicide Case : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈనెల 12న జరిగిన యువతి ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడే హంతకుడని తేల్చారు.
- Harish Thanniru
- Published on- September 21, 2026 / 11:54 AM IST
Godavarikhani woman suicide case
Godavarikhani Woman Killed Case : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఈనెల 12న జరిగిన యువతి ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడే హంతకుడని తేల్చారు. పథకం ప్రకారం యువతికి గడ్డి మందు తాగించి చనిపోయేలా చేశాడని పోలీసుల విచారణలో తేలింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లికి చెందిన జెట్టి నవీన్ (38) మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని శ్రీరాంపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహం అయ్యి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడేళ్ల కిందట గర్రెపల్లి గ్రామానికి చెందిన తాండ్ర అక్షితరాణి (20) అదే కళాశాలలో డిప్లొమా కోర్సులో చేరింది. కొద్దిరోజులకు నవీన్, అక్షితరాణి మధ్య ప్రేమబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే అక్షితరాణి ఫోన్లో ఆమెకు తెలియకుండా నవీన్ ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. దీంతో ఆమె ఫోన్‌కు వచ్చే మెస్సేజెస్, ఫోన్‌కాల్స్ వివరాలు తన ఫోన్‌కు మెస్సేజ్ రూపంలో వచ్చేవి. వీరి ప్రేమ విషయం గర్రెపల్లిలో తెలియడంతో ఆమె కుటుంబం గోదావరిఖనికి వచ్చి ఉంటోంది.
డిప్లొమా పూర్తయ్యాక అక్షిత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజినీరింగ్‌లో చేరింది. రెండో సంవత్సరం చదువుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో క్షేత్ర స్థాయి శిక్షణలో భాగంగా మరికొందరు విద్యార్థులతో కలిసి గోదావరిఖనిలోని సింగరేణి రెండో గనికి వచ్చింది. 12రోజుల పాటు ట్రైనింగ్ తీసుకోగా.. అక్కడ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన బొమ్మకంటి రవికుమార్‌తో అక్షితరాణికి పరిచయమైంది. వారి మధ్య ఫోన్ చాటింగ్స్‌తోపాటు వారిద్దరూ చనువుగా ఉంటున్నారని నవీన్ తెలుసుకొని అక్షితపై పగ పెంచుకున్నాడు. అక్షితను బెదిరించి రవికుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేయించాడు. అయితే, సరియైన ఆధారాలే లేకపోవటంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయం అక్షిత ఇంట్లో తెలియడంతో చదువు మాన్పించి.. పట్టణంలోని ఓ కంప్యూటర్ సెంటర్లో ఉద్యోగంలో చేర్పించారు.
అక్షితపై కోపం పెంచుకున్న నవీన్.. ఆమెను హత్య చేయాలని భావించాడు. పథకం ప్రకారం.. ఈనెల 12న కళాశాలకు వెళ్లేటప్పుడు స్నేహితుడి వద్ద గడ్డిమందు తీసుకొని బాటిల్‌లో నింపాడు. సాయంత్రం అక్షితకు ఫోన్‌చేసి రామగుండంలోని ఎఫ్‌సీఐ అడ్డరోడ్డు వద్దకు రమ్మన్నాడు. ఆమె రాగానే కారులో ఎక్కించుకుని తిప్పుతూ గొడవపడ్డాడు. ఆత్మహత్యాయత్నం చేస్తే రవికుమార్‌పైకి కేసు వెళ్తుందని అక్షితతో గడ్డిమందు తాగించాడు. తనపై రవికుమార్ లైంగిక దాడికి పాల్పడటం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె చేతనే లేఖ రాయించి ఆమె ఫోన్లోనే ఫొటో తీయించాడు. అనంతరం అక్షిత అపస్మారక స్థితికి చేరుకునే వరకు కారులోనే తిప్పిన నవీన్ ఇక బతికే అవకాశం లేదని నమ్మకం వచ్చాక ఆమె ఫోన్ నుంచే అక్షిత తండ్రికి ఫోన్ చేశాడు. అప్పటికే ఆమె అపస్మారక స్థితికి చేరుకోగా తల్లిదండ్రులతో కలిసి గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 13న బాధితురాలు మృతి చెందింది.
ఆత్మహత్యకు ముందు బాధితురాలి ఫోన్లో లభించిన లేఖ ఆధారంగా రవికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం సీసీ పుటేజీలను పరిశీలించగా.. నవీన్ కారులో అక్షిత ఎక్కిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. నవీన్ కాల్ డేటా, కాల్ రికార్డింగ్, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించారు. దీంతో నవీన్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. అక్షితను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు.
