Indiramma Indlu : ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు.. తొలి దశలో చాన్స్ వీరికే..

Indiramma Indlu : ఆటో నడిపే కార్మికుల సొంతింటి కలను నిజం చేసేందుకు ఏకంగా 2,000 ఫ్లాట్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.220 కోట్లతో నాలుగు ప్రాంతాల్లో రూపుదిద్దుకోనున్న ఈ ప్రత్యేక కాలనీ ఎక్కడెక్కడ రాబోతోంది? ఎవరికి ఇళ్లు కేటాయించనున్నారు? తెలుసుకుందాం.

Indiramma Houses For Auto Drivers

Indiramma Houses For Auto Drivers : ఏళ్ల తరబడి అద్దె ఇళ్లలో ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న హైదరాబాద్ ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆటో నడిపే కార్మికుల సొంతింటి కలను నిజం చేసేందుకు ఏకంగా 2,000 ఫ్లాట్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.220 కోట్లతో నాలుగు ప్రాంతాల్లో రూపుదిద్దుకోనున్న ఈ ప్రత్యేక కాలనీ ఎక్కడెక్కడ రాబోతోంది? ఎవరికి ఇళ్లు కేటాయించనున్నారు? తెలుసుకుందాం.

Also Read : Telangana Govt : తెలంగాణలోని రైతులకు శుభవార్త.. రూ.20 లక్షల వరకు సబ్సిడీ.. ఇక ఆ ఇబ్బందులకు చెక్..

హైదరాబాద్ నగరంలోని పేద వర్గాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇందిరమ్మ టవర్లను నిర్మాణం చేస్తే అర్హులైన వారికి వాటిని అందిస్తోంది. ఈ క్రమంలో సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఆటో డ్రైవర్ల కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రత్యేకంగా ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఈ పథకం కింద నగరంలోని నాలుగు ప్రాంతాల్లో మొత్తం 2,000 ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.220 కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.

హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ గౌతమ్ శుక్రవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించి జీవో జారీ చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని బండ్లగూడ, గంధంగూడ, పేట్ బషీరాబాద్, జల్పల్లి/లక్ష్మిగూడ ప్రాంతాల్లో ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఒక్కో ప్రాంతంలో 500 చొప్పున మొత్తం 2,000 ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.220 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించారు.

ఆటో నగర్ కాలనీలో ఇళ్లు పొందేందుకు అర్హత ప్రమాణాలు ఇప్పటికే అమల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ పథకం నిబంధనల ప్రకారమే ఉంటాయని మంత్రి తెలిపారు. నిర్మాణానికి అవసరమైన స్థలాల లభ్యత, సాంకేతిక అంశాలు, భౌగోళిక అనుకూలతలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. వీటిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR), ఆర్థిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హౌసింగ్ బోర్డు అధికారులకు సూచించారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఆటోరిక్షా కార్మికులకోసం ఆటో నగర్ కాలనీ ప్రాజెక్టును తీసుకొచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి భరోసా కల్పించే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందని, గుడిసెలు లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యమని స్పష్టం చేశారు.