TS Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు మరో శుభవార్త.. త్వరలో 1,597 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
TS Govt Jobs : తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మరో 1,597 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది.
- Harish Thanniru
- Updated on- June 4, 2026 / 03:21 PM IST
Unemployed in Telangana Notification for 1597 Posts
TS Govt Jobs Notification: తెలంగాణలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పలు శాఖల్లో 290 పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెలలో మరో 1,597 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వివిధ శాఖల్లో 1800 పోస్టుల భర్తీకి జూన్ నెలలోనే నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు భారీగా ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ సిద్ధమైంది. రెండు రోజుల క్రితం పలు శాఖల్లో 290 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన టీజీపీఎస్సీ.. మరో 1597 పోస్టుల భర్తీకి చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫైలును సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించడంతోపాటు ఉద్యోగ నియామకాల బోర్డు త్వరలోనే అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 1,597 పోస్టులకుగాను 180 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, 24 డిప్యూటీ డీఈవో, 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నట్లు సమాచారం.
