Telangana Congress: ఒకరి తర్వాత ఒకరు.. కాంగ్రెస్‌ పార్టీకి మరో సీనియర్ లీడర్ కుటుంబం దూరం..! ఎందుకిలా

దివంగత నేత పీజేఆర్ మరణానంతరం తనయుడు కూడా గతంలోనే కాంగ్రెస్ పార్టీని వీడి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. తన తండ్రి పార్టీకి చేసిన సేవలను గుర్తించైనా తగిన గుర్తింపు ఇవ్వలేదన్న అసహనంతో విష్ణువర్ధన్‌రెడ్డి హస్తం పార్టీని వీడారు.

  • Published On : April 3, 2026 / 10:22 PM IST
  • హస్తం పార్టీకి రాజీనామా యోచనలో దివంగత డీఎస్‌ కొడుకు సంజయ్‌
  • మొన్న జీవన్‌రెడ్డి..ఇప్పుడు సంజయ్‌..ఎందుకిలా.?
  • సీనియర్లు, లీడర్ల వారసులు కాంగ్రెస్‌కు దూరం అవుతున్నారా?
  • గతంలోనే బీఆర్ఎస్‌లో చేరిన పీజేఆర్ తనయుడు విష్ణు

 

Telangana Congress: సీనియర్లు, సీనియర్ లీడర్ల వారసులు. వాళ్లంతా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్‌లు. కానీ ఒక్కక్కొరుగా హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉంటే నట్టేట ముంచుతున్నారని మండిపడుతూ..ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. లేటెస్ట్‌గా దివంగత నేత డీఎస్ తనయుడు సంజయ్‌ కూడా కాంగ్రెస్ గూటి నుంచి బయటికి వచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ మధ్యే సీనియర్ మోస్ట్‌ కాంగ్రెస్ లీడర్ జీవన్‌రెడ్డి కూడా హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్ అంటే మారుపేరుగా ఉన్న నేతలు పార్టీని ఎందుకు వీడుతున్నట్లు?

ఎక్కడైనా ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి జంపింగ్స్‌ ఉంటాయ్. లేటెస్ట్‌గా తెలంగాణలో డిఫరెంట్‌ సీన్ కనిపిస్తోంది. కాంగ్రెస్ అంటే ఆ నేతలు..ఆ నేతల పేరు ఎత్తితే కాంగ్రెస్‌ గుర్తుకు వచ్చే లీడర్లు..హస్తం పార్టీకి హ్యాండ్ ఇస్తున్నారు. ఇప్పటికే జ‌గిత్యాల‌కు చెందిన మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి పార్టీని వీడారు. నాలుగు దశాబ్ధాలకు పైగా కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న ఆయన పార్టీ క‌ష్టకాలంలో అండ‌గా నిలిచారు. అలాంటి నేత కాంగ్రెస్‌ను వీడ‌టం చ‌ర్చనీయాంశంగా మారింది.

పార్టీకి లాయల్‌గా ఉన్నా పదవి ఇవ్వలేదని అసంతృప్తి..

తనకు అన్యాయం జరిగిందని, గుర్తింపు ఇవ్వలేదన్న ఆవేదనతో..సొంత పార్టీ అధిష్టానం, రాష్ట్ర పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు జీవన్‌రెడ్డి. ఇప్పుడు మ‌రో కుటుంబం కూడా కాంగ్రెస్‌తో బంధం తెచ్చుకుంది. దివంగత నేత డి. శ్రీనివాస్‌ తనయుడు ధర్మపురి సంజయ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడానికి రెడీ అయ్యారట. గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశిస్తే ఇవ్వలేదని..కార్పొరేషన్ పదవి ఇస్తామని మొండి చెయ్యి చూపారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి లాయల్‌గా ఉన్నా పదవి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సంజయ్.

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో ర‌థ‌సార‌థిగా ప‌ని చేసిన డి.శ్రీనివాస్‌కు..రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. డీఎస్ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వ‌చ్చింది. అలాంటి డీఎస్ తెలంగాణ ఏర్పడిన త‌ర్వాత అనివార్య కార‌ణాల‌తో కాంగ్రెస్‌ను వీడారు. బీఆర్ఎస్‌లోకి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఆ త‌ర్వాత కొంతకాలానికి మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీపై మ‌మ‌కారంతో తిరిగి వ‌స్తున్నానని..తాను చ‌నిపోతే త‌న‌పై కాంగ్రెస్ జెండా కప్పాలంటూ చెప్పిన నాయకుడు డీఎస్‌.

మ‌హేష్ గౌడ్ ఉన్నంత కాలం ప్రాధాన్యత ద‌క్కద‌నే ఆవేదన..

ఆయన కాంగ్రెస్‌లోకి వ‌చ్చినా త‌న ఇద్దరు కుమారుల్లో నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ బీజేపీలో ఉన్నారు. డీఎస్ మరో తనయుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. డీఎస్ మరణానంతంరం కూడా..ఆయ‌న పెద్ద కొడుకు సంజ‌య్ కాంగ్రెస్‌తోనే ఉంటూ వ‌చ్చారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి రెండున్నరేళ్లు అవుతున్నా..సంజ‌య్ విష‌యంలో పార్టీ పెద్దలు పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. పైగా ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న మ‌హేష్ గౌడ్‌కు డీఎస్ కుటుంబానికి కాస్త గ్యాప్ ఉంద‌నే ప్రచారం ఉంది. పీసీసీ చీఫ్‌గా మ‌హేష్ గౌడ్ ఉన్నంత కాలం పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ తనకు ఎలాంటి ప్రాధాన్యత ద‌క్కద‌నే ఆలోచ‌న‌కు వచ్చిన సంజ‌య్..కాంగ్రెస్ వీడుతున్నార‌ట‌.

ఇప్పటికే కాంగ్రెస్‌తో బ‌ల‌మైన బంధం ఉన్న జీవ‌న్ రెడ్డి దారిలోనే డీఎస్ కొడుకు సంజ‌య్ న‌డ‌వాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. జీవ‌న్ రెడ్డికి, డీఎస్‌కు మ‌ధ్య మంచి స్నేహం ఉండేది. అందుకే జీవ‌న్ రెడ్డి దారిలో సంజ‌య్ వెళ్లాల‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. సంజ‌య్ కూడా బీఆర్‌ఎస్‌లో చేరే ఛాన్స్ ఉంద‌నే చ‌ర్చ జోరుగా న‌డుస్తోంది. పైగా ఇద్దరు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అంతో ఇంతో పట్టున్న నేతలు కావడంతో..కాంగ్రెస్‌కు అంతో ఇంతో డ్యామేజ్ తప్పదన్న చర్చ జరుగుతోంది.

మరో దివంగత నేత పీజేఆర్ మరణానంతరం తనయుడు కూడా గతంలోనే కాంగ్రెస్ పార్టీని వీడి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నారు. తన తండ్రి పార్టీకి చేసిన సేవలను గుర్తించైనా తగిన గుర్తింపు ఇవ్వలేదన్న అసహనంతో విష్ణువర్ధన్‌రెడ్డి హస్తం పార్టీని వీడారు. ఇలా కాంగ్రెస్‌తో అవినాభావ సంబంధం ఉన్న కీలక నేతలు..లీడర్ల వారసులు పార్టీని వీడుతుండ‌టం తెలంగాణ పాలిటిక్స్‌లో చ‌ర్చనీయాంశంగా మారింది.

Also Read: ప్రభుత్వ సలహాదారు పదవిపై ఎందుకీ సస్పెన్స్‌? ఆ కీలక పదవి దక్కేదెవరికి, వేం నరేందర్ రెడ్డి స్థానంలోకి వచ్చేదెవరు?