Kcr Representative Image (Image Credit To Original Source)
BRS: ఇష్యూ ఏదైనా..సిచ్యువేషన్ మరేదైనా..కాంగ్రెస్, బీఆర్ఎస్‌లో ఆ పదిమంది జంపింగ్ ఎమ్మెల్యేల చుట్టే చర్చ జరుగుతోంది. ఇప్పుడు మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల వేళ..ఇటు జంపింగ్ ఎమ్మెల్యేలకు..అటు కారు పార్టీకి కొత్త చిక్కు వచ్చి పడిందట. పార్టీ మారిన ఆ పది మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయాలా? వద్దా? అనే డైలమాలో ఉందట గులాబీ పార్టీ. మరోవైపు బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే పరిస్థితి ఏంటని జంపింగ్ ఎమ్మెల్యేలు ఆలోచనలో పడ్డట్లు టాక్ నడుస్తోంది. ఇంతకు బీఆర్ఎస్ విప్ జారీ చేస్తుందా? కారు పార్టీ విప్ ఇస్తే జంపింగ్ ఎమ్మెల్యేల డెసిషన్ ఎలా ఉండబోతోంది?
మేయర్, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల వేళ..పది మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు కొత్త చిక్కు వచ్చి పడింది. టెక్నికల్‌గా బీఆర్‌ఎస్ సభ్యులుగానే ఉన్నందున, మేయర్, ఛైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విప్‌ను పాటించక తప్పని పరిస్థితి. విప్ ధిక్కరిస్తే పదవి పోయే ప్రమాదం, పాటిస్తే సొంత పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వస్తుంది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు డైలమాలో పడ్డారట. మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎంపికలో కీలకమైన ఎక్స్ అఫిషియో ఓటు..ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేలకు హెడెక్‌గా మారిందట. పది మంది ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారని అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే వీరందరికి ఇబ్బందులు తప్పవన్న టాక్ వినిపిస్తోంది.
మున్సిపల్ ఎన్నికల్లో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికకు సంబంధించి బీఆర్‌ఎస్ విప్ జారీ చేస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మరింత చిక్కుల్లో పడే పరిస్థితి. విప్ పాటిస్తే కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా, బీఆర్‌ఎస్ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ విప్‌ను ధిక్కరిస్తే పార్టీ ఆదేశాలను ధిక్కరించినందుకు వారిపై అనర్హత వేటు వేసేందుకు బీఆర్‌ఎస్‌కు బలమైన, చట్టపరమైన ఆధారం లభించనుంది. సుప్రీంకోర్టు ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి స్పీకర్‌కు గడువు విధించిన నేపథ్యంలో బీఆర్ఎస్ విప్‌ను ఉల్లంఘిస్తే ఎమ్మెల్యే పదవులకే ముప్పు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైందట.
పది మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా సందిగ్ధంలో ఉందట. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోంది బీఆర్ఎస్. ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఇంకా దానం నాగేందర్, కడియం శ్రీహరి విచారణ కంటిన్యూ అవుతోంది. ఆ 10 మంది అధికార కాంగ్రెస్‌లో చేరిపోయారని ఆధారాలతో సహా స్పీకర్‌కు ఫిర్యాదు చేసి, కోర్టుకెళ్లిన బీఆర్ఎస్..ఇప్పుడు విప్ జారీ చేస్తే వాళ్లంతా తమ పార్టీలోనే ఉన్నట్లు ఒప్పుకున్నట్లు అవుతుందని భావిస్తోందట. వాళ్లంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని స్పీకర్ ఇచ్చిన తీర్పును తాము సమర్ధించినట్లు అవుతుందా అని కూడా ఆలోచిస్తున్నారట.
సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్‌లో ఉంది కాబట్టి..ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తే ఎంతవరకు అడ్వాంటేజ్‌గా మారే అవకాశం ఉందన్నదానిపై ఆరా తీస్తోందట గులాబీ పార్టీ. మరోవైపు విప్ జారీ చేయకపోతే కొన్ని మున్సిపాలిటీలను దక్కించుకునే ఛాన్స్ కోల్పోతామని ఆందోళన చెందుతున్నారట. సేమ్‌టైమ్ విప్ ఇచ్చినా ఆ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అభ్యర్దులకు ఓటు వేస్తారన్న గ్యారెంటీ కూడా లేదని లెక్కలు వేసుకుంటున్నారట. అయితే పరిస్థితులను బట్టి..లీగల్ ఒపీనియన్ తీసుకుని విప్ జారీ చేయాలనే ఆలోచనగా వచ్చారట గులాబీ బాస్ కేసీఆర్.
Also Read: ఎత్తుకు పైఎత్తులు.. హంగ్‌లో కింగ్ ఎవరు? తెలంగాణలో ఇంట్రెస్టింగ్‌గా మున్సిపల్ రాజకీయం