Brs: బండి భగీరథ్ కేసులో టాప్ గేర్‌లో కారు ఫైట్.. ఆ విషయంలో బీఆర్ఎస్ సక్సెస్ అయినట్లేనా?
బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయ్యాలంటూ ప్రెజర్ పెంచిన బీఆర్ఎస్..ఇప్పుడు బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తోంది. కొడుకు తప్పును కప్పిపుచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ బేషరతుగా పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
- Naveen
- Published on- May 18, 2026 / 10:58 PM IST
- ఆందోళనలు, ర్యాలీలతో ఒత్తిడి పెంచిన గులాబీ పార్టీ
- వరుస ప్రెస్‌మీట్లతో సర్కార్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ అటాక్
- భగీరథ్ ఎపిసోడ్ ఓవర్..ఇప్పుడు బండి టార్గెట్‌గా దూకుడు
- తామే బలమైన ప్రతిపక్షమని సంకేతం ఇస్తూ పోరాటం
- కాంగ్రెస్, బీజేపీని కార్నర్ చేస్తూ క్రెడిట్ కొట్టేసే ప్లాన్
Brs: ఆ ఇష్యూలో గట్టి ఫైటే చేసింది కారు పార్టీ. ఎట్టకేలక్ ప్రెజర్ బిల్డ్ చేసి..అరెస్టా.? లొంగుబాటా.? అంటూ అటు కాంగ్రెస్, ఇటు బండి సంజయ్‌ను ఇరికించేలా బీఆర్ఎస్ వేసిన స్కెచ్ కూడా డిస్కషన్ పాయింట్ అయింది. ఇక ఇప్పుడు గులాబీ దళం అసలు సిసలు పొలిటికల్ ఫైట్‌కు తెరదీసిందన్న టాక్ వినిపిస్తోంది. బండి సంజయ్‌ను కేంద్రమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ ఏకంగా రోడ్డెక్కుతోంది బీఆర్ఎస్. కారు పార్టీ టార్గెట్ కాంగ్రెస్, బీజేపీని కార్నర్ చేయడమేనా.? భగీరథ్ కేసులో బీఆర్ఎస్ క్రెడిట్ కొట్టేసినట్లేనా.?
తెలంగాణ పాలిటిక్స్‌లో బండి భగీరథ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశాన్ని బీఆర్ఎస్ కేవలం విమర్శలకే పరిమితం చేయకుండా..రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి అగ్రెసివ్‌గా ముందుకెళ్లింది. ఏకంగా పేట్ బషీరాబాద్ పీఎస్ ముట్టడి, డీజీపీకి వినతిపత్రాలు, ప్రెస్‌మీట్లు, ప్రజా ఉద్యమాలతో సర్కార్‌పై ఒత్తిడి పెంచడంలో కీ రోల్ ప్లే చేసింది. చివరకు బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారా.? లేక ఆయనే లొంగిపోయారా.? రేవంత్ ప్రభుత్వం చెప్తున్నట్లు సంజయ్ కొడుకును అరెస్ట్ చేశారా.? బండి సంజయ్ ప్రకటించినట్లు భగరీథ్‌ను పోలీసులకు అప్పగించారా.? ఈ అంశాలపై కూడా విస్తృతంగా చర్చ జరిగేలా చేసి బీఆర్ఎస్ రాజకీయంగా పైచేయి సాధించిందన్న చర్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీలను కార్నర్ చేస్తూ తామే బలమైన ప్రతిపక్షమనే సంకేతాన్ని ఇచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.
బండి భగీరథ్ కేసు తెరమీదకు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస ట్వీట్స్ చేస్తూ..ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అయితే డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చేసి సంచలన విషయాలు బయపెడుతూ..భగరీథ్ జైలుకు వెళ్లే వరకు సర్కార్‌పై ప్రెజర్ పెట్టగలిగారు. కేటీఆర్ అయితే ఆర్ఎస్పీని ఓపెన్ డయాస్ మీదే అప్రిషియేట్ చేసిన పరిస్థితి. బండి భగీరథ్ ఇష్యూలో పోరాడి..ఓ అమ్మాయికి న్యాయం దక్కడంలో కీలక పాత్ర పోషించారని ఆర్ఎస్ ప్రవీణ్‌ను పార్టీ కార్యక్రమంలో మెచ్చుకున్నారు కేటీఆర్. దీంతో తమ నిరంతర పోరాటం ఫలితంగానే బండి భగీరథ్ అరెస్ట్ జరిగిందని బీఆర్ఎస్ ఓపెన్‌గానే చెప్పుకున్నట్లు అయింది.
కాంగ్రెస్, బీజేపీ తీరుపై డౌట్స్ వ్యక్తం అయ్యేలా చేయడంలో సక్సెస్..!
ఓవరాల్‌గా ఈ కేసులో అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీ తీరుపై డౌట్స్ వ్యక్తం అయ్యేలా చేయడంలో తాము కొంతలో కొంతైనా సక్సెస్ అయ్యామని గులాబీ లీడర్లు క్రెడిట్ కొట్టేస్ ప్లాన్ వేస్తున్నారు. కేవలం ఒక సంఘటనగా కాకుండా, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కారు పార్టీ. ఓవైపు ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూనే..మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనంటూ హైలెట్ చేసేలా యాక్టివిటీ చేపట్టింది. ఓ వైపు అధికార పార్టీ నేతలు ఔట్‌రైట్ స్టేట్‌మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండగా..అటు బీజేపీలో అంతర్గత చర్చ ఏ నేత మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు సాహసం చేయలేదు. దీనంతటికి తాము చేసిన పోరాటమే కారణమని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది.
బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్..
ఇక బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయ్యాలంటూ ప్రెజర్ పెంచిన బీఆర్ఎస్..ఇప్పుడు బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తోంది. కొడుకు తప్పును కప్పిపుచ్చి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ బేషరతుగా పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలో కారు పార్టీ కార్యకర్తలు ప్రొటెస్ట్ చేశారు. తక్షణమే బండి సంజయ్‌ని కేంద్రమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని..కేటీఆర్ డిమాండ్ చేసిన నెక్స్ట్ డేనే బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ రోడెక్కారు. సిరిసిల్లలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా చేపట్టిన ధర్నా పరస్పర దాడులు, ఘర్షణలతో రణరంగంగా మారింది. బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో..రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి, తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆ తర్వాత దాడులకు దిగారు.
రాజకీయ వ్యూహాలకు బీఆర్ఎస్ పదును..
మొన్నటి వరకు భగీరథ్‌ను కేసు నుంచి తప్పించే కుట్ర జరుగుతోందని ఫైర్ అయిన బీఆర్ఎస్..ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. శనివారం రాత్రి భగీరథ్ జైలుకు వెళ్లారు. దీంతో ఇప్పుడు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది గులాబీ పార్టీ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్‌ను బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేయడం..ఆ తర్వాత గులాబీ శ్రేణులు రోడ్డెక్కడం చర్చకు దారితీస్తోంది.
సంజయ్‌ను బర్తరఫ్ చేయాలంటూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి బీజేపీని కార్నర్ చేసేలా వ్యూహాలు రచిస్తోంది ప్రధాన ప్రతిపక్షం. అటు అధికార కాంగ్రెస్‌కు, ఇటు అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీకి తామే ప్రత్యామ్నాయం అంటూ స్ట్రాంగ్ ఇండికేషన్స్ పంపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. భగరీథ్ ఇష్యూలో సక్సెస్ అయినట్లే..సంజయ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అప్పర్ హ్యాండ్ సాధిస్తుందా.? లేదా అనేది చూడాలి.
