Telangana Caste Census: కులాల లెక్కలు.. కాంగ్రెస్ కొత్త చిక్కులు తెచ్చి పెట్టుకుందా? ఇరకాటంలో పడిందా? ఎందుకు..

ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత గౌడ సామాజిక‌వ‌ర్గానికి చెందిన 12 మందికి పదవులు దక్కాయని చెబుతున్నారు. మున్నూరుకాపు సామాజిక‌వ‌ర్గంలో తొమ్మిది మందికి ప‌ద‌వులు ఇచ్చారని అంటున్నారు.

  • Published on- April 24, 2026 / 08:46 PM IST
  • కులగణన రిపోర్ట్‌ కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడేస్తుందా?
  • కులాల జనాభా ప్రకారం పదవుల కోసం నేతల డిమాండ్
  • మేమెంతో..మాకంత అంటున్న ముదిరాజ్‌లు, యాదవులు

 

Telangana Caste Census: కులగణన. ఇదో పెద్ద అస్త్రంగా చెప్పుకుంది హస్తం పార్టీ. కానీ ఏదైతే తమ బలం అనుకున్నారో..అదే అధికార కాంగ్రెస్‌కు హెడెక్‌గా మారుతోందట. ఎవరినో ఇరికించబోయి..హస్తం పార్టీనే ఇరకాటంలో పడే పరిస్థితి వచ్చిందట. బీసీ నినాదంతో ఛాంపియ‌న్‌గా నిలుద్దామ‌నుకుంటే..చిత్రమైన ప‌రిస్థితి ఎదుర‌వుతోంద‌ట‌. కులాల లెక్కలు బయటపెట్టిన అధికార పార్టీకి ..సొంతగూటిలో పదవుల సెగ మొదలైందట. కార్పొరేష‌న్ ప‌ద‌వులను జ‌నాభా ప్రకారం పంచాలన్న డిమాండ్ ఊపందుకుందట. పార్టీ అగ్రనేత చెప్పిన స్లోగన్‌నే ముందు పెట్టి పదవులు కోసం పట్టుబడుతున్నారట హస్తం పార్టీ లీడర్లు.

తెలంగాణ కాంగ్రెస్‌లో సోష‌ల్ ఈక్వేష‌న్ టాపిక్ హాట్ హాట్‌గా మారుతోంది. కులగణన రిపోర్టును బయటపెట్టి..అధికార పార్టీ కొత్త చిక్కులు తెచ్చి పెట్టుకుందన్న చర్చ జరుగుతోంది. రేవంత్ సర్కార్ వెల్లడించిన కులగణన రిపోర్టుల్లో..బీసీల్లో ముదిరాజ్‌లు, యాద‌వ్‌లే టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ముదిరాజ్‌లు 26 ల‌క్షల పైచిలుకు జ‌నాభాతో 7.4 శాతంగా ఉన్నారు. సెకండ్ ప్లేస్‌లో యాద‌వ్‌ల జనాభా 5.7 శాతంగా 20 ల‌క్షల పైచిలుకు పాపులేషన్ ఉంది. ఇంత భారీ జ‌నాభా ఉన్న ఈ రెండు వ‌ర్గాలు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వంపై ఒత్తిడి చేస్తున్నార‌ట‌.

ఇప్పటికైనా త‌మ వాటా త‌మ‌కు కావాల‌ని డిమాండ్..

పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..జిత్నీ ఆబాదీ..ఉత్నా హ‌క్ అనే నినాదాన్ని వినిపించారు. అంటే జ‌నాభా ఎంత ఉంటే..వారికి అంత వాటా అనే నినాదాన్ని బ‌లంగా వినిపించారు. ఇప్పుడు అదే నినాదాన్ని తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ నేత‌లు బ‌లంగా వినిపిస్తున్నారట. తెలంగాణ‌లో ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతున్న నేప‌థ్యంలో..ఇప్పటికైనా త‌మ వాటా త‌మ‌కు కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ముదిరాజ్‌లు, యాద‌వులు త‌మ జనాభా ప్రకారం..మంత్రి వ‌ర్గం, కార్పొరేష‌న్ ప‌ద‌వుల్లో చోటు కల్పించాలని కోరుతున్నారట. యాద‌వ సామాజిక‌వ‌ర్గం ఇప్పటికే గాంధీభ‌వ‌న్‌లో తీవ్ర నిర‌స‌న వ్యక్తం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే వ‌చ్చిన‌ప్పుడు ఏకంగా గాంధీభ‌వ‌న్‌లో గొర్రెల‌తో ప్రొటెస్ట్ చేయ‌డం అప్పట్లోనే తీవ్ర చ‌ర్చనీయాంశం అయింది.

కార్పొరేష‌న్ ప‌ద‌వుల భర్తీలో తమ సామాజికవర్గానికి పెద్దపీట వేయాల‌ని డిమాండ్..

బీసీల‌లో ద‌క్కే ప‌ద‌వులు కూడా కేవ‌లం రెండు సామాజిక‌వ‌ర్గాల‌కే ద‌క్కుతున్నాయ‌నేది మిగ‌తా వర్గాల వాదన. అటు ప్రభుత్వంలో..ఇటు పార్టీలో మున్నూరు కాపు, గౌడ్లకే పదవులు ద‌క్కుతున్నాయ‌ని బ‌హిరంగ విమ‌ర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత గౌడ సామాజిక‌వ‌ర్గానికి చెందిన 12 మందికి పదవులు దక్కాయని చెబుతున్నారు. మున్నూరుకాపు సామాజిక‌వ‌ర్గంలో తొమ్మిది మందికి ప‌ద‌వులు ఇచ్చారని అంటున్నారు. జ‌నాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్‌, యాద‌వ సామాజిక‌వ‌ర్గానికి మొండి చెయ్యి చూపుతున్నార‌ని రగిలిపోతున్నారట. ఇప్పుడు కులాల లెక్క బయటికి రావడంతో..త్వర‌లో చేప‌ట్టబోయే కార్పొరేష‌న్ ప‌ద‌వుల భర్తీలో ముదిరాజ్‌, యాద‌వ సామాజిక వ‌ర్గానికి పెద్దపీట వేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ముదిరాజ్ సామాజిక‌వ‌ర్గం నుంచి..ఎలాంటి ప‌దవులు లేకుండా ఉన్న సునీతారావ్‌, నీలం మ‌ధు, క‌స్తూరి న‌రేంద్‌, సురేంద‌ర్ ముదిరాజ్ ముందు వ‌రుస‌లో ఉన్నారు. అలాగే యాద‌వ సామాజిక‌వ‌ర్గం నుంచి చ‌ర‌ణ్ కౌశిక్ యాద‌వ్‌, సరితా తిరుప‌త‌య్య, లోకేష్ యాద‌వ్‌, వేణుగోపాల్ యాద‌వ్, లింగం యాద‌వ్‌, శ్రీకాంత్ యాద‌వ్ రేసులో ఉన్నారు. అయితే సొంత పార్టీ ప్రభుత్వం విడుద‌ల చేసిన కులాల లెక్కలు..అధికార కాంగ్రెస్‌నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ‌ట‌. ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం జిత్నీ ఆబాదీ..ఉత్నా హ‌క్ అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారట నేతలు. ఇక‌ త్వర‌లో భ‌ర్తీకానున్న కార్పొరేష‌న్ ప‌ద‌వుల్లో ముదిరాజ్‌, యాదవ్‌లకు జనాభా ప్రకారం పదవులు దక్కుతాయో లేదో చూడాలి.

Also Read: డ్వాక్రా మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయనున్న ప్రభుత్వం.. ఒక్కొక్కరికి..