Delimitation Bill: డీలిమిటేషన్‌కు బ్రేక్‌.. సీట్ల విభజన ఆగిపోవడం దక్షిణాదికి ప్లస్సా, మైనస్సా?

వ్యూహంతోనే మోదీ దూకుడును అడ్డుకున్నామని..ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నామని అంటోంది కాంగ్రెస్. ప్రస్తుత ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే, తెలంగాణ గొంతు పార్లమెంట్‌లో నొక్కేయబడుతుందని..అందుకే తాము పోరాడి మరీ బీజేపీ వెనకడుగు వేసేలా చేశామని చెప్పుకుంటోంది హస్తం పార్టీ.

  • Updated on- April 19, 2026 / 02:03 AM IST
  • వంత్‌ హైబ్రీడ్‌ మోడల్‌తో మేలెంత.? డ్యామేజ్ ఎంత?
  • రేవంత్‌ తీరుతో తెలంగాణకు, దక్షిణాదికి నష్టమంటున్న బీజేపీ
  • సీట్ల పెంపును అడ్డుకుని సౌత్‌, నార్త్‌కు గ్యాప్ పెంచారన్న టాక్

 

Delimitation Bill: ఫిఫ్టీ పర్సెంట్ సీట్ల పెంపు అని బీజేపీ. హైబ్రీడ్‌ మోడల్ అంటూ రేవంత్. ఉమెన్‌ కోటా, డీలిమిటేషన్‌ చుట్టే చర్చ జరిగింది. కట్‌ చేస్తే పార్లమెంట్‌లో డీలిమిటేషన్‌ బిల్లును అడ్డుకుని తీరాయి ప్రతిపక్షాలు. అయితే హైబ్రీడ్‌ మోడల్‌పై చర్చకు తెరలేపిన రేవంత్‌ మీద..బీజేపీ పక్షాలు ఫుల్ ఫైర్ మీదున్నాయి. కాంగ్రెస్‌ తీరుతో దక్షిణాదికి తీవ్ర నష్టం జరగబోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు పెట్టిన లిటిగేషన్లు దక్షిణాదికి ప్లస్సా? మైనస్సా? హైబ్రీడ్‌ మోడల్‌తో రేవంత్‌కు ఎక్స్‌పోజర్‌ రాగ.. ఫ్యూచర్‌లో సౌత్‌కు డ్యామేజ్ చేయనుందా?

మహిళా రిజర్వేషన్, లోక్‌సభ సీట్ల పెంపు బిల్లుకు పార్లమెంట్‌ వేదికగా బ్రేకులు వేశాయి ప్రతిపక్షాలు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో బిల్లులన్నీ వీగిపోయాయి. దీంతో మహిళా రిజర్వేషన్ అమలుకు బ్రేకులు పడగా..డీలిమిటేషన్ కూడా ఆగిపోయింది. ఇంకేముంది ఇప్పుడే అసలు సిసలు పొలిటికల్ బ్లేమ్ గేమ్ జోరందుకుంది. డీలిమిటేషన్‌తో దేశాన్ని నార్త్, సౌత్ భాగాలుగా విభజించే కుట్రతో..మహిళా బిల్లును ముందు పెట్టి కేంద్రం కుట్రలు చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అడ్డుకుని కాంగ్రెస్ సహా విపక్షాలు చరిత్రాత్మక తప్పు చేశాయని..ఎన్డీయే పక్షాలు ఫైర్ అవుతున్నాయి. సీఎం రేవంత్‌ టార్గెట్‌గానే అటాక్‌కు దిగుతున్నారు బీజేపీ నేతలు. విపక్షాల తీరుతో దేశం ఒక చారిత్రక అవకాశాన్ని కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 2026 జనాభా లెక్కలతో డీలిమిటేషన్‌ చేస్తే దక్షిణాదికి అతి పెద్ద నష్టమని వైసీపీ అధినేత జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

డీలిమిటేష‌న్ బిల్లు ఆగడంతో తెలంగాణకు ముఖ్యంగా దక్షిణాదికి తీవ్ర అన్యాయం..!

లోక్‌సభ సీట్ల పున‌ర్విభ‌జ‌నపై హైబ్రీడ్ మోడ‌ల్‌ను తెర‌పైకి తెచ్చి దేశవ్యాప్త చర్చకు తెరదీశారు సీఎం రేవంత్‌. పార్లమెంట్‌ వేదికగా మోదీ అహంకారాన్ని ఓడించామ‌ని అంటున్నారు. వ్యూహంతోనే మోదీ దూకుడును అడ్డుకున్నామని..ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నామని అంటోంది కాంగ్రెస్. ప్రస్తుత ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే, తెలంగాణ గొంతు పార్లమెంట్‌లో నొక్కేయబడుతుందని..అందుకే తాము పోరాడి మరీ బీజేపీ వెనకడుగు వేసేలా చేశామని చెప్పుకుంటోంది హస్తం పార్టీ. అయితే సీఎం రేవంత్ వాద‌న‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతోంది బీజేపీ. డీలిమిటేష‌న్ బిల్లు ఆగడంతో తెలంగాణకు, ముఖ్యంగా దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ నేత‌లు మండిపడుతున్నారు. రాజ్యాంగంలో లేని..హైబ్రీడ్ మోడ‌ల్‌తో పున‌ర్విభ‌జ‌న ఎలా సాధ్యమవుతుంద‌న్నది బీజేపీ నేత‌ల ప్రశ్న.

కాంగ్రెస్‌లో హైప్‌ తెచ్చుకునేందుకు హైబ్రీడ్ మోడ‌ల్‌..

డీలిమిటేషన్ జరిగితే తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 150 దాటుతాయి..పార్లమెంట్ సీట్లు కూడా 17 నుంచి 26కు పెరిగే ఛాన్స్ ఉండేది. జ‌నాభా ప్రాతిపాదిక‌న చేసినా..లేక ప్రోరేటా ప్రకారం చేసినా..పెద్దగా తేడా ఉండద‌ని అంటున్నారు. రేవంత్ చెబుతున్న హైబ్రీడ్ మోడ‌ల్‌తో ఒక‌టి రెండు సీట్లకు మించి..తేడా రాద‌న్నది కమలనాథుల వాదన. రేవంత్‌ కాంగ్రెస్‌లో తనకు తాను హైప్‌ తెచ్చుకునేందుకు..హైబ్రీడ్ మోడ‌ల్‌ను తెరపైకి తెచ్చి..సౌత్ స్టేట్స్‌లో సీట్లు పెరుగ‌కుండా అడ్డుకున్నారని అంటున్నారు బీజేపీ నేత‌లు. లోక్‌సభ సీట్ల పెంపునకు GSDPకి లింకు పెట్టిన రేవంత్‌రెడ్డి..రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల‌ను కూడా తలసరి ఆదాయం ప్రకారం పెంచుతారా అని క్వశ్చన్ చేస్తోంది బీజేపీ. అలా చేస్తే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటార‌ని..త‌మ‌దైన విశ్లేష‌ణ చేస్తున్నారు కమలం పార్టీ లీడర్లు.

పొలిటికల్ ఈక్వేషన్‌లో బీజేపీ డీలిమిటేష‌న్‌ కోసం అడుగులు వేస్తుంటే.. నార్త్, సౌత్‌ అంటూ కాంగ్రెస్ కొత్త పంచాయితీకి తెరలేపి బ్రేకులు అయితే వేయగలిగింది. దీంతో ఇప్పట్లో సీట్ల పెంపు అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది. నియోక‌జ‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రగ‌క‌పోతే..భవిష్యత్‌లో దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిస్థితి ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. రేవంత్‌ తెచ్చిన సౌత్ వర్సెస్ నార్త్‌ వార్ ఫ్యూచర్‌లో తెలంగాణకే కాదు దక్షిణాదికి డ్యామేజ్ చేయబోతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్ వేదిక‌గా జ‌రిగిన పోలిటిక‌ల్ గేమ్ ఎవ‌రి పుట్టి ముంచుతుందో? డీలిమిటేషన్ వార్..ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.

Also Read: హర్ముజ్ లో హైటెన్షన్.. భారత నౌకలపై ఇరాన్ అటాక్..