Jeevan Reddy Representative Image (Image Credit To Original Source)
Laxman Kumar Adluri: ఆ నియోజకవర్గ రాజకీయాలు ఓ మంత్రికి హెడెక్‌గా మారాయి. కనీసం మంత్రి పదవి దక్కిందన్న సంతోషాన్ని కూడా దూరం చేస్తున్నాయట. సీనియర్ నేతకు.. ఎమ్మెల్యేకు మధ్య జరుగుతున్న పొలిటికల్ ఫైట్‌లో అమాత్యుల వారు నలిగిపోతున్నారట. అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపట్టలేక…గురువు గారి మాట జవదాటలేక ఆయన సఫర్ అవుతున్నారట. గురువు తరఫున వకాల్తా తీసుకోని అధిష్టానం దగ్గర వాదించలేకపోతున్నారట. ఇద్దరు నేతల మధ్య మంత్రి పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారిందనే చర్చ సాగుతుంది. ఇంతకు ఎవరా మంత్రి? ఆయనకొచ్చిన బాధేంటి?
వరుస ఓటముల తర్వాత ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి లక్ష్మణ్‌కు..రెండో విడత క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కింది. ఇన్నేళ్ల తన కష్టానికి ఫలితం దక్కిందనుకుంటున్న సందర్భంలో..జగిత్యాల జగడం ఆయనకు హెడెక్‌గా మారిందట. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్, తన గురువు అయిన మాజీమంత్రి జీవన్ రెడ్డి మధ్య నడుస్తోన్న పొలిటికల్ వార్‌లో అడ్లూరి ఇబ్బంది పడాల్సి వస్తోందట. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే సంజయ్‌కి సపోర్ట్‌గా నిలుస్తుండటంతో..జీవన్ రెడ్డికి పట్టలేనంత ఆగ్రహన్ని తెప్పిస్తుంది. జీవన్ రెడ్డిని కాదని..సంజయ్‌తో కలిసి నడవడాలంటే మంత్రి ఇబ్బంది పడుతున్నారట. తప్పని పరిస్థితుల్లో నడవాల్సి వస్తే…గురువు గారి గుస్సాకు గురి కావాల్సి వస్తుందట.
జగిత్యాలలో అన్నీ తానై నడిపించిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి 2023లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ హస్తం పార్టీతో దోస్తీ కట్టారు. దీంతో తమను నమ్ముకుని వచ్చారని సంజయ్‌కి హస్తం పార్టీ పెద్దలు ప్రయారిటీ ఇస్తున్నారట. ఇది జీవన్‌రెడ్డికి ఏ మాత్రం నచ్చట్లేదట. ఎప్పటికప్పుడు మంత్రులు, సమీక్షలు..వేదిక ఏదైనా తన నిరసనను వ్యక్తం చేస్తున్నా..అధిష్టానం మాత్రం జీవన్ రెడ్డిని పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తోంది.
అయితే జగిత్యాల జిల్లా మంత్రిగా వ్యవహరిస్తున్న అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరి మధ్య నలిగిపోతున్నారట. జగిత్యాల జగడంలో ఇన్వాల్వ్ కావాలంటేనే జంకుతున్నారట. ఒక్క అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రమే కాదు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జగిత్యాలకు రాకుండానే తిరుగు ప్రయాణమవుతున్నారు. సీనియర్ నేతలే జీవన్ రెడ్డిని ఫేస్ చేయడానికి వెనకాముందు ఆడుతున్నారంటే…ఇక అడ్లూరి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
జగిత్యాలలో జరిగే అధికారిక కార్యక్రమాలకు హాజరు కావాలంటే అడ్లూరి ఆలోచిస్తున్నారట. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం లోకల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి పాల్గొనాలి. లేకపోతే ప్రోటోకాల్ ఉల్లంఘన కింద విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంజయ్ కుమార్‌కు సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందనే కారణంతో ..మంత్రి కూడా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటున్నారట. ఇదే సందర్భంలో జీవన్ రెడ్డికి మద్దతుగా నిలిచి అధిష్టానాన్ని తప్పుపట్టలేని పరిస్థితిలో ఉన్నారట. అధిష్టానాన్ని ఎదిరించడం నాతో సాధ్యమేనా అంటూ గురువు జీవన్ రెడ్డికి సమాధానమిస్తున్నారట. అయినా సరే పార్టీ నిర్ణయాన్ని తప్పుపడుతున్న సందర్భంలో మంత్రి అడ్లూరిపై కూడా జీవన్ రెడ్డి ఓపెన్‌గానే పైర్ అవుతూనే ఉన్నారు.
ఎదురు సమాధానం చెప్పలేక మౌనంగా మిన్నకుండి పోతున్నారట మంత్రిగారు. అధిష్టానం గీసిన లక్ష్మణ రేఖ దాటకుండా..తన గురువుకు న్యాయం చేయాలంటున్నారట. జీవన్‌రెడ్డికి ఏదో ఒక ప్రోటోకాల్ పదవి ఇవ్వాలంటూ అధిష్టానం దగ్గర పట్టుపడుతున్నారట అడ్లూరి. ఇటీవల జీవన్ రెడ్డి విమర్శల దాడి పెంచుతుండటంతో పాటు..ఆయన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు తెరవెనుక ప్రయత్నాల్లో బిజీ అయిపోయారట మంత్రిగారు.
ఏదైనా గురువు కోసం జీవన్‌రెడ్డి పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం ఆసక్తికరంగా మారింది. జీవన్ రెడ్డి ఇష్యూ సాల్వ్ అయితేనే అడ్లూరి కళ్లల్లో మంత్రి దక్కిందన్న ఆనందం కనిపించే అవకాశం ఉందంటున్నారు. లేకపోతే మిగితా మంత్రుల బాటలో ఆయన కూడా జీవన్‌రెడ్డి కనిపిస్తే చాలు సైడ్ పోవాల్సిందే అంటున్నారు.
Also Read: లక్కీ ఛాన్స్ ఎవరికో..? కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేపుతున్న రాజ్యసభ రేసు