Karimnagar – Congress Vs Brs: సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వర్సెస్ మాజీలు… భగ్గుమంటున్న ఉమ్మడి కరీంనగర్‌ పాలిటిక్స్‌

అప్పుడైనా.. ఇప్పుడైనా.. కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ కాకమీద కనిపిస్తుంటాయ్‌. ఆరోపణలు, విమర్శలు, వివాదాలతో సెగలు పుట్టిస్తుంటాయ్‌. ఇప్పుడు కూడా అలాంటి సీనే కనిపిస్తోంది.

  • Updated on- May 29, 2026 / 09:29 PM IST

Karimnagar – Congress Vs Brs: సిట్టింగ్‌లు వర్సెస్‌ మాజీలు.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజకీయం సెగలు కక్కేలా చేస్తోంది. ఇదీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సీన్‌. మంథని, ధర్మపురి.. నిన్నటికి నిన్న జగిత్యాల. ఆ రచ్చ రగులుతుండగానే.. ఇప్పుడు పెద్దపల్లి పంచాయితీ తెరమీదకు వస్తోంది. కరీంనగర్ జిల్లాలో అసలేం జరుగుతోంది. పెద్దపల్లి పొలిటికల్‌ ఫైట్‌ వెనక అసలు కారణం ఏంటి.. ఓపెన్ ఛాలెంజ్‌లకు వరకు ఎందుకు వెళ్లింది..

అప్పుడైనా.. ఇప్పుడైనా.. కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ కాకమీద కనిపిస్తుంటాయ్‌. ఆరోపణలు, విమర్శలు, వివాదాలతో సెగలు పుట్టిస్తుంటాయ్‌. ఇప్పుడు కూడా అలాంటి సీనే కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీల మధ్య జరుగుతున్న యుద్ధం.. పాలిటిక్స్‌పై మరింత ఆసక్తి పుట్టిస్తున్నాయ్‌. మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇద్దరు నేతల పరస్పర విమర్శలు, ఆరోపణలు, సవాళ్లతో మంథని ప్రతీరోజూ రీసౌండ్ ఇస్తూనే ఉంటుంది.

ఇక అటు ధర్మపురిలోనూ సేమ్‌ సీన్‌. మంత్రి అడ్లూరి వర్సెస్ మాజీ మంత్రి కొప్పుల మధ్య రాజకీయ యుద్ధం పీక్స్‌లో కనిపిస్తోంది. మీరేం చేశారంటే.. మీరేం చేశారంటూ.. ఇద్దరి మధ్య సవాళ్ల పర్వం కంటిన్యూ అవుతోంది. ఇక నిన్నటికి నిన్న జగిత్యాల పరిణామాలు క్రియేట్‌ చేసిన పొలిటికల్ హీట్ అంతా ఇంతా కాదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సంజయ్‌.. మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి మధ్య భారీ యుద్ధమే జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌ గూటికి చేరిపోయారు. వీటన్నింటిపై చర్చ జరుగుతుండగానే.. ఇప్పుడు పెద్దపల్లి రచ్చ తెరమీదకు వచ్చింది.

ఎమ్మెల్యే కనుసన్నల్లో మట్టి మాఫియా నడుస్తుందని ఫైర్‌..

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరుకుంటోంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో.. ఇద్దరు నేతల మధ్య మాటలు తూటాలను మించి పేలుతున్నాయ్‌. కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారంలోకి రావడానికి ముందు చెప్పిన ఎమ్మెల్యే.. ఇప్పుడెందుకు అలా చేస్తున్నారని సిట్టింగ్‌ ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు కనుసన్నల్లోనే పెద్దపల్లిలో మట్టి మాఫియా నడుస్తోందన్న మనోహర్ రెడ్డి ఆరోపణలతో.. రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే కూడా రియాక్ట్ కావడంతో.. హీట్ పీక్స్‌కు చేరింది.

చెప్పులు మెడలో వేసుకు తిరుగుతావా అంటూ సవాల్..

మనోహర్‌ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే విజయరమణారావు.. రైతులకు న్యాయం చేయకపోతే తాను పదవిలో కొనసాగనంటూ ప్రకటించారు. జనాలు ప్రశ్నిస్తున్నారని నీలా చెప్పులు వదిలి పరిగెట్టను అంటూ మనోహర్‌ రెడ్డిని ఎద్దేవా చేస్తూనే.. అలాంటి పరిస్థితే వస్తే రాజకీయాల్లోనే ఉండను అంటూ సవాల్ విసిరారు విజయ రమణారావు. ఇక్కడితో ఆగకుండా.. అధికారంలో ఉన్నప్పుడు ఇసుక, మట్టి దందాలే కాదు.. ఇనుప సామాను, రేకులను కూడా ఎత్తుకెళ్లావంటూ విమర్శల దాడి చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మనోహర్ రెడ్డి మరింత స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని.. నిరూపించలేకపోతే చెప్పులు మెడలో వేసుకు తిరుగుతావా అంటూ సవాల్ చేశారు. దీంతో పెద్దపల్లి రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. ఇద్దరి మధ్య పంచాయితీ మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇలా సిట్టింగ్‌లు వర్సెస్ మాజీలు అన్నట్లు సాగుతున్న యుద్ధం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది. అధికారంలో ఉండి ఏమీ చేయట్లేదని వాళ్లు.. అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని వీళ్లు.. ఈ విమర్శలకు యాడ్ అవుతున్న ఆరోపణలు.. ఇవన్నీ కలిసి పాలిటిక్స్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపించేలా చేస్తోంది. ఇప్పుడే ఇలా ఉందంటే.. ఎన్నికల సమయానికి ఈ మంటలు ఇంకే రేంజ్‌కు చేరుతాయో అనే డిస్కషన్‌.. రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

Also Read: తెలంగాణలోని మహిళలకు బిగ్ అలర్ట్.. జూన్ 2నుంచి ‘మహాలక్ష్మీ స్మార్ట్’ కార్డులు.. ఇలా అప్లయ్ చేసుకోండి..