Mahalaxmi Smart Card : తెలంగాణలోని మహిళలకు బిగ్ అలర్ట్.. జూన్ 2నుంచి ‘మహాలక్ష్మీ స్మార్ట్’ కార్డులు.. ఇలా అప్లయ్ చేసుకోండి..
Mahalaxmi Smart Card : రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి మహిళలకు ‘మహాలక్ష్మీ స్మార్ట్’ కార్డులను జారీ చేయనుంది. పైలట్ ప్రాజెక్టుగా మొదట జిల్లాకొక మండలంలో కార్డులు జారీ చేస్తారు. కార్డులు వచ్చే వరకూ ఆధార్‌తో ప్రయాణించవచ్చు.
Mahalaxmi Smart Card : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆధార్ కార్డు చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే, ఇకనుంచి ఆధార్ కార్డు అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణం సాగించొచ్చు.. కానీ, ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చే ‘మహాలక్ష్మీ స్మార్ట్ కార్డు’లను తీసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి మహిళలకు ‘మహాలక్ష్మీ స్మార్ట్’ కార్డులను జారీ చేయనుంది. పైలట్ ప్రాజెక్టుగా మొదట జిల్లాకొక మండలంలో కార్డులు జారీ చేస్తారు. కార్డులు వచ్చే వరకూ ఆధార్‌తో ప్రయాణించవచ్చు. అయితే, ఏటీఎం తరహాలో చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డు జారీ చేస్తారు. ముందుగా ఆధార్ కార్డు, ఒక ఫొటో సేకరించి మహిళల ప్రాథమిక సమాచారం చిప్‌తో అనుసంధానిస్తారు. ఈ స్మార్ట్ కార్డులో లబ్ధిదారుడి పూర్తి వివరాలు.. ఫొటో, క్యూఆర్ కోడ్ ఉంటాయి. తర్వాత వారి పేర్లతో కార్డు జారీ చేస్తారు. అమల్లోకి వచ్చాక స్మార్ట్ కార్డు చూపకుంటే ఉచిత ప్రయాణానికి అనుమతివ్వరు.
మహాలక్ష్మీ స్మార్ట్ కార్డు వల్ల.. అర్హతలేని ప్రయాణికుల దుర్వినియోగాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన వేలాది మహిళా కూలీలు, ప్రైవేటు ఉద్యోగులు, నకిలీ ఆధార్ కార్డుల సాయంతో బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీకి పెద్దమొత్తంలో ఆధాయానికి గండిపడుతోంది. స్మార్ట్ కార్డు అందుబాటులోకి వస్తే.. కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్నవారు మాత్రమే బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.
మహాలక్ష్మీ స్మార్ట్ కార్డుతో ప్రయాణ దూరం, మార్గాలు, సమయాలపై కచ్చితమైన సమాచారం ఉంటుంది. గ్రామం, మండలం, జిల్లా, జోన్ వారీ వినియోగ సమాచారం లభ్యం అవుతుంది. కండక్టర్లపై పనిభారం తగ్గుతుంది. పేపర్ టికెట్లులేని ప్రయాణంతోపాటు రద్దీ రూట్లు తెలుస్తాయి. బస్సులు పెంచడం, తగ్గించడం తేలికవుతుంది.
అయితే, ప్రస్తుతానికి ఆర్టీసీలో విద్యార్థులకు రాయితీ, ఉద్యోగులకు, ఇతరులకు నెలవారీగా సీజన్ పాస్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో మహాలక్ష్మీలకు స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించింది. అయితే, ఈ కార్డులను మీ సేవా, బస్ పాస్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి తీసుకోవాలని సమాచారం.
కార్డుల జారీ, దరఖాస్తు చేసుకునే విధానం, ఇతర నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, సమీప కార్డుల జారీ కేంద్రాన్ని కనుగొనడానికి టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో పూర్తి సమారాన్ని త్వరలో పొందుపరుస్తారు. కార్డులు అందే వరకు ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
