Mahesh Kumar Goud: తెలంగాణ పీసీసీ చీఫ్‌కు ఆ జిల్లాలోకి నో ఎంట్రీ..! ఏంటా జిల్లా, ఎందుకు నో ఎంట్రీ..

తన ప్రయత్నాలకు అడ్డంకిగా మారిన ముఖ్యనేతల గురించి పీసీసీ చీఫ్ బయటకు చెప్పకపోయినా.. ఆ నేతలు ఎవరు అనే దానిపై గాంధీభవన్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.

  • Updated on- May 28, 2026 / 01:21 AM IST
  • ఆ జిల్లాలో నిజంగా అడుగుపెట్టలేకపోతున్నారా ?
  • జిల్లాలో మీటింగ్ పెట్టాలని 2 నెలలుగా ప్రయత్నం..
  • మహేష్‌కుమార్ గౌడ్‌కు జిల్లా నేతల నో సపోర్ట్!

Mahesh Kumar Goud: ఏంటి ఈ పరిస్థితి అనుకుంటున్నాయట తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు. పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్‌కు ఆ జిల్లాలో మాత్రం నో ఎంట్రీ బోర్డు దర్శనమిస్తోందట.. కాంగ్రెస్ రథసారధిగా రాష్ట్రవ్యాప్తంగా తిరగాల్సిన పీసీసీ చీఫ్.. నిజంగా ఆ జిల్లాలో అడుగు పెట్టలేకపోతున్నారా..? అక్కడ సమావేశం పెట్టాలని రెండు నెలల నుంచి చూస్తున్నా.. జిల్లా నేతలు సహకరించడం లేదా.. ఇంతకీ ఆయనను ఇబ్బంది పెడుతున్న నేతలు ఎవరు.. ఆ జిల్లా ఏంటి..

ఏ పార్టీలో అయినా.. అధ్యక్షుడిదే తుది నిర్ణయం. ఐతే తెలంగాణ కాంగ్రెస్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందా అంటే.. అవును అనే అంటున్నాయ్ పొలిటికల్ వర్గాలు. పీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కావొస్తున్నా.. పార్టీపై పట్టు సాధించలేకపోతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ పలువురు నేతలు.. ఆయనకు సహకరించడం లేదనే టాక్ వినిపిస్తోంది. పార్టీపై పట్టు సాధించలేకపోవడంతో.. పీసీసీ చీఫ్ తీరుపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. హస్తం పార్టీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. గ్రౌండ్ లెవల్ లో పార్టీని మరింత స్ట్రాంగ్ చేయడంపై ఫోకస్ పెంచింది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీని కోసం జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు పీసీసీ చీఫ్. ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నా.. ఒక్క జిల్లా విషయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఇబ్బందులు తప్పడంలేదనే టాక్ వినిపిస్తోంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరగని సమీక్షా సమావేశం..

ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో ప్రాంతానికి వెళ్లి సమావేశం ఏర్పాటు చేసి.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలు చుట్టేసిన నేతలు.. ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం ఇప్పటివరకు సమీక్ష సమావేశం నిర్వహించలేదు. అక్కడ సమావేశం పెట్టడం కోసం.. రెండు నెలలుగా పీసీసీ చీఫ్ చేయని ప్రయత్నం అంటూ లేదట. జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని రెండు నెలలుగా పీసీసీ చీఫ్ చెప్తున్నా.. జిల్లాకి చెందిన ముఖ్యనేతలు పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. కీలక నేతల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. పీసీసీ చీఫ్ కూడా ఏమీ చేయలేకపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఆ నేతలు ఎవరు అనే దానిపై గాంధీభవన్‌లో జోరుగా చర్చ..

దాదాపు అన్ని జిల్లాల్లో రివ్యూ మీటింగ్‌లు నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రం ఎంట్రీ దొరకడం లేదని ఆయన సన్నిహితులే చెప్తున్న పరిస్థితి ! ఐతే తన ప్రయత్నాలకు అడ్డంకిగా మారిన ముఖ్యనేతల గురించి పీసీసీ చీఫ్ బయటకు చెప్పకపోయినా.. ఆ నేతలు ఎవరు అనే దానిపై గాంధీభవన్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇంకొంత కాలం ఎదురుచూసి, అప్పటికి సమావేశం నిర్వహించడం కుదరకపోతే.. సమావేశం నిర్వహించాల్సిన బాధ్యతను పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌కు అప్పగించాలని పీసీసీ చీఫ్ భావిస్తున్నారని తెలుస్తోంది.

పీసీసీ అధ్యక్షుడికే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతుంటే..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించడానికి.. పీసీసీ అధ్యక్షుడికే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతుంటే.. తమ పరిస్థితి ఏంటని పలువురు డీసీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీ ఇంచార్జీ హైదరాబాద్ రాగానే.. తమ జిల్లా పరిస్థితిని, ఆ నేతలు పెడుతున్న ఇబ్బందులను ఇంచార్జి దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా నేతలు సిద్ధం అవుతున్నారట. మరి ఇంచార్జి మీనాక్షి ఎంటర్ అయితే అయినా.. పరిస్థితిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.

Also Read: బీఆర్ఎస్ లోనూ సుమన్ వ్యాఖ్యల కలకలం.. కేసీఆర్ సీరియస్..! ఏం జరగబోతోంది?