Balka Suman: బీఆర్ఎస్లోనూ సుమన్ వ్యాఖ్యల కలకలం.. కేసీఆర్ సీరియస్..! ఏం జరగబోతోంది?
సుమన్ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ కూడా సీరియస్‌గానే రియాక్ట్ అవుతోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినైనా వదిలేది లేదనే ఇండికేషన్ ఇవ్వాలని భావిస్తోందట సర్కార్.
- సుమన్ వ్యాఖ్యలతో రాజకీయ ప్రకంపనలు..
- అధినేత కేసీఆర్ దృష్టికి సుమన్ వ్యాఖ్యలు !
- బాల్క సుమన్ వ్యాఖ్యలపై కేటీఆర్ సీరియస్!
- సుమన్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్పై కాంగ్రెస్ టార్గెట్..
- సుమన్ వ్యవహారంలో ఇప్పుడేం జరగబోతోంది?
Balka Suman: సింగరేణి భవన్ కాలబెట్టాలి.. రైల్వే పట్టాలు కోసేయాలి.. ఇక మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలనే కాదు.. సొంత పార్టీని కూడా షేక్ చేస్తున్నాయట. ఇక ఈ మాటలు గులాబీ బాస్ దృష్టికి కూడా చేరడంతో ఆయన సుమన్ పై గుస్సా అయ్యారట. కేటీఆర్ కూడా ఈ వ్యాఖ్యలపై సీరియస్ కాగా.. అటు అధికార కాంగ్రెస్ నేతలు కూడా కేసుల మీద కేసులు పెడుతున్నారట. అసలు సుమన్ వ్యాఖ్యలు క్రియేట్ చేస్తున్న ప్రకంపనలు ఏంటి.. ఇప్పుడేం జరగబోతోంది..
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ చేసిన వ్యాఖ్యలు.. మరోసారి తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయ్. సింగరేణి కార్మిక సంఘ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు.. రాజకీయవర్గాల్లో, సోషల్ మీడియాలో కలకలం క్రియేట్ చేస్తున్నాయ్. మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, సింగరేణి భవన్ కాలబెట్టాలి.. జీఎం ఆఫీస్ ముట్టడిద్దాం, రైల్వే లైన్లు కోసేద్దాం లాంటి పదాలు.. వివాదాస్పదంగా మారాయ్. సుమన్ వీడియోలు వైరల్ కావడంతో.. అధికార పార్టీతో పాటు మిగలిన రాజకీయ పక్షాలు కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించాయ్. సుమన్‌ది సాధారణ ఆవేశపూరిత ప్రసంగం కాదని.. కారు పార్టీలో పెరిగిపోతున్న అసంతృప్తికి.. కార్యకర్తల్లో తగ్గుతున్న ఉత్సాహానికి.. నాయకత్వంపై పెరుగుతున్న ఒత్తిడికి సంకేతమంటూ బీఆర్ఎస్ను ప్రత్యర్థి పార్టీలు టార్గెట్ చేస్తున్నాయ్.
జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందనే వాదన..
ఇక అటు బాల్క సుమన్ వ్యాఖ్యలు.. గులాబీ బాస్ కేసీఆర్ దృష్టికి కూడా వెళ్లినట్లు తెలంగాణభవన్ వర్గాలు అంటున్నాయ్. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేడర్ ను మళ్లీ యాక్టివ్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో.. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి రాజకీయంగా నష్టం చేసే అవకాశం ఉందనే టెన్షన్ గులాబీ వర్గాల్లో కనిపిస్తోంది. ఇక అటు సుమన్ వ్యాఖ్యలు ఇక్కడ రాజకీయ యుద్ధానికి దారి తీయడమే కాదు.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయనేది మరికొందరి చర్చ. అటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా.. సుమన్ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సాఫ్ట్ అండ్ స్ట్రాటజిక్ అపోజిషన్ వ్యూహంతో ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్న టైమ్‌లో.. ఇలా మిలిటెంట్ వ్యాఖ్యలు పార్టీ భవిష్యత్ వ్యూహాలకు ఇబ్బందిగా మారే చాన్స్ ఉందని కూడా గులాబీ దళంలో చర్చ సాగుతోంది. దీనిపై బాల్క సుమన్‌కు నేడో రేపో షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
క్రిషాంక్‌కు దీటుగా నిలిచే వ్యూహంలో భాగమనే చర్చ
ఇక బీఆర్ఎస్ యువ నాయకత్వంలో అంతర్గత ఆధిపత్య పోరు ఈ ఘటనతో బయటపడిందా అనేది మరికొందరి వాదన. ఈ మధ్య జిల్లాల్లో కేడర్‌పై ప్రభావం పెంచుకునేందుకు పలువురు యువ నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బాల్క సుమన్ వ్యాఖ్యలు కూడా.. ఈ మధ్య దూకుడుగా వెళ్తున్న క్రిషాంక్‌కు ధీటుగా నిలిచే వ్యూహంలో భాగమనే చర్చ కూడా జరుగుతోంది. మహా అయితే నెల రోజులు జైల్లో ఉంటామన్న బాల్క సుమన్ వ్యాఖ్యలను.. కొందరు కార్యకర్తలు ఆవేశపూరిత నినాదంగా చూస్తుంటే.. మరికొందరు మాత్రం అది చట్ట వ్యవస్థను సవాల్ చేసే ధోరణి అంటున్నారు. సుమన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియా కూడా రెండుగా విడిపోయింది. ఉద్యమ స్ఫూర్తి అంటూ సమర్థించే గ్రూప్ ఒకటి కాగా.. ఇవి హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు అంటూ మరో వర్గం విమర్శిస్తోంది. ఇక అటు పొలిటికల్‌గా ఇప్పటికే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బీఆర్ఎస్ను ఈ వివాదం మరింత ఇబ్బంది పెడుతుందా.. కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపే ప్రయత్నంగా మారుతుందా అనేది హాట్‌టాపిక్‌గా మారింది.
ఇక సుమన్ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ కూడా సీరియస్‌గానే రియాక్ట్ అవుతోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరినైనా వదిలేది లేదనే ఇండికేషన్ ఇవ్వాలని భావిస్తోందట సర్కార్. అందులో భాగంగానే ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్.. నేరుగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఇప్పటికే సుమన్‌పై సుమోటోగా కేసు కూడా నమోదైంది. ఇక మరోవైపు తన వ్యాఖ్యల తీవ్రతను గుర్తించిన సుమన్ కూడా.. నాలిక కరుచుకున్నట్లే కన్పిస్తోంది. తన స్పీచ్‌ను ఫ్యాబ్రికేట్ చేశారంటూ.. తన వ్యాఖ్యల అర్థం వేరేనంటూ.. మీడియా ముందుకు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు బాల్క సుమన్. మొత్తానికి ఈ వ్యవహారం అటు సుమన్‌కు.. ఇటు బీఆర్ఎస్కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: దేశంలో మరో కొత్త పార్టీ.. కాక్రోచ్ జనతా పార్టీ టైప్ లో.. ఇది కార్పొరేట్ మజ్దూర్.. దీనిలో చేరాలంటే..
