Gossip Garage: గొర్రెల పంపిణీ స్కామ్‌లో వాట్‌ నెక్స్ట్? ఈడీ దర్యాప్తుతో బీఆర్ఎస్‌లో గుబులు..

ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ సిట్ ఏర్పాటు చేసి డైలీ ఎపిసోడ్‌తో కేసీఆర్ కుటుంబసభ్యుల మీద రోజుకో అలిగేషన్‌ వెలుగులోకి వస్తోంది. ఇక ఫార్ములా ఈ-కారు రేస్‌ ఇష్యూలో కేటీఆర్ టార్గెట్‌గా ఏసీబీ కేసులు, విచారణలు నడుస్తూనే ఉన్నాయి.

Gossip Garage: కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌, హరీశ్‌ టార్గెట్‌ అయ్యారు. ఈ-కార్ రేసులో కేటీఆర్‌ను కేసులు వెంటాడుతున్నాయ్. ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ రచ్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఏకంగా గులాబీ బాస్‌ కుటుంబాన్ని దాటి.. ఆనాటి అమాత్యులకు ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది సీన్. వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఈడీ చెప్తుండటం..గులాబీ పార్టీకి మరింత హెడెక్‌గా మారిందట. అప్పుడు పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్రపైనా ఈడీ ఆరా తీస్తోందన్న టాక్ వినిపిస్తోంది. గొర్రెల పంపిణీ స్కామ్‌లోవాట్‌ నెక్స్ట్? తలసాని వరకు వ్యవహారం వెళ్తుందా?

అధికారం పోయి..అపోజిషన్‌లోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయింది. పవర్‌లో ఉన్నప్పుడు అంతా బానే ఉంది. కారు పార్టీ గద్దె దిగినప్పటి నుంచి ఆ పార్టీ నేతలకు ముఖ్యంగా కేసీఆర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ వస్తోంది. కాంగ్రెస్‌ సర్కార్ వస్తూవస్తూనే విద్యుత్‌ కొనుగోళ్లు అంటూ కేసీఆర్ టార్గెట్‌గా విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అందులో ఏం తేల్చారో తెలియదు కానీ..కొన్నాళ్లు పవర్ పర్చేజ్‌ మీద వార్ నడిచింది.

వరుస కేసులు, విచారణలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి..
తర్వాత ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ సిట్ ఏర్పాటు చేసి డైలీ ఎపిసోడ్‌తో కేసీఆర్ కుటుంబసభ్యుల మీద రోజుకో అలిగేషన్‌ వెలుగులోకి వస్తోంది. ఇక ఫార్ములా ఈ-కారు రేస్‌ ఇష్యూలో కేటీఆర్ టార్గెట్‌గా ఏసీబీ కేసులు, విచారణలు నడుస్తూనే ఉన్నాయి. కాళేశ్వరం కమిషన్‌ అంటూ కేసీఆర్, హరీశ్‌రావు వరకు విచారణ వెళ్లింది. కమిషన్‌ ఆల్రేడీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. పీసీ ఘోష్‌ రిపోర్ట్‌లో ఏముందో అని బీఆర్ఎస్‌ ఆందోళన పడుతున్న టైమ్‌లోనే..పాతదే అయినా లేటెస్ట్‌గా తెరమీదకు వచ్చింది గొర్రెల పంపిణీ స్కామ్.

Also Read: రామగుండం బీఆర్ఎస్‌లో ఇప్పటి నుంచే టికెట్ ఫైట్.. రేసులో ముగ్గురు లీడర్లు.. క్యాడర్‌లో గందరగోళం

గొర్రెల పంపిణీలో వెయ్యి కోట్ల కుంభకోణం?
గొర్రెల పంపిణీ పథకం కేసులో విచారణ కీలక దశకు చేరుకోవడం బీఆర్ఎస్‌ను మరింత టెన్షన్ పెడుతోందట. గొర్రెల పంపిణీలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని ఈడీ తేల్చిందంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో పశు సంవర్ధకశాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు ఓఎస్డీగా ఉన్న కల్యాణ్ కుమార్ నివాసంతో పాటు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించి..వెయ్యి కోట్ల వరకు చేతులు మారినట్లు ఈడీ గుర్తించినట్లు చెబుతున్నారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో ముడిపడిన ఖాతాలకు నిధులు మళ్లింపు..!
కాగ్ ఆడిట్‌లో 7 జిల్లాల్లో గొర్రెల కొనుగోలు పథకంలో 253.93 కోట్ల నష్టం జరిగినట్లు మెన్షన్ చేశారు. దీని ఆధారంగా విచారణ జరిపిన ఈడీ.. మొత్తం 33 జిల్లాల్లో ఈ పథకంలో వెయ్యి కోట్ల గోల్‌మాల్ జరిగిందని అనుమానిస్తుందట. ఈ నిధులను ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లతో ముడిపడిన 200కి పైగా ఖాతాలకు మళ్లించినట్టు ఈడీ గుర్తించిందని అంటున్నారు. గొర్రెల పథకానికి లభ్ధిదారుల చేసిన చెల్లింపులు, అలాగే సంస్థలకు నిధుల బదిలీ సమయంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు.

ఇంత పెద్ద స్కామ్‌లో అధికారుల పాత్ర మాత్రమే ఉందా? రాజకీయ నేతల ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉందా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్‌గా తేల్చింది ఈడీ. ఈ క్రమంలో వెయ్యి కోట్ల కుంభకోణాన్ని పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు తెలియకుండానే చేశారా అన్న అనుమానాన్ని ఈడీ వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి స్థాయిలో ఆదేశాలు లేకుండానే ఇంత పెద్ద మొత్తంలో గొర్రెలు పంపిణీ చేయకుండానే బిల్లుల చెల్లింపులు ఎలా జరిగాయన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోందట.

ప్రధానంగా గొర్రెల పంపిణీలో జరిగిన కుంభకోణంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమేయం, ఈ స్కామ్‌లో ఆయన పాత్రపై ఈడీ దృష్టి సారించినట్లు చర్చ జరుగుతోంది. ఇదే ఇప్పుడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతోందట. ఇప్పటికే పలు అంశాల్లో పార్టీ అధినేత కేసీఆర్ సహా కేటీఆర్, హరీశ్‌రావులపై ఆరోపణలు రావడం, విచారణలు జరుగుతుండటం పట్ల బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ టెన్షన్ పడుతున్నారు. ఇటువంటి సమయంలో మరో స్కామ్‌లో పార్టీకి చెందిన మాజీ మంత్రి తలసాని ఇరుక్కుంటారా అన్న ఆందోళన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.