×
Ad

V Hanumantha Rao: ఒకే ఒక్క చాన్స్.. ఇదే లాస్ట్.. మళ్లీ ఏ పదవి అడగబోను అంటున్న వీహెచ్..! అధిష్టానం నిర్ణయమేంటి?

పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని.. మరెన్నో అవకాశాలను కోల్పోయానని.. కాంగ్రెస్ కీలక నేతల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీహెచ్‌.

  • Published On : March 2, 2026 / 09:28 PM IST

Representative Image (Image Credit To Original Source)

  • తనకు రాజ్యసభ పదవి ఇవ్వాలంటూ విన్నపాలు
  • పార్టీకి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకోవాలని వినతి
  • రేవంత్ నుంచి రాహుల్‌ వరకు VH వినతులు..
  • అధిష్టానం నిర్ణయమేంటి.. VHకు చాన్స్ దక్కేనా ?

 

V Hanumantha Rao: ఒక్క చాన్స్‌.. ఒకే ఒక్క చాన్స్‌.. ఇదే నాకు ఆఖరి ఛాన్స్‌. ఇవీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఓ సీనియర్ నేత మాటలు. ఇందిరాగాంధీ నుంచి రాహుల్‌ గాంధీ వరకు అందరితో కలిసి పని చేశా. పార్టీనే నమ్ముకున్నా. ఎన్నో అవకాశాలను వదులుకున్నానంటూ.. ఆఖరి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఒక్కసారి రాజ్యసభ పదవి ఇచ్చేస్తే.. మళ్లీ ఎప్పుడూ ఏమీ అడగనంటున్న ఆ సీనియర్ నాయకుడి విన్నపాన్ని.. హైకమాండ్‌ పరిగణనలోకి తీసుకుంటుందా.. హస్తం పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీహెచ్‌.. రాజ్యసభ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు పదవి ఇవ్వాలంటూ.. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరినీ అడుగుతున్నారు. పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ నుంచి మొదలు.. సీఎం రేవంత్ రెడ్డి వరకు.. తనకు ఈ ఒక్కసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తనకే ఎందుకు ఇవ్వాలనే దానిపై చాలా కారణాలు చెప్తున్నారు కూడా ! ఇదే తనకు చివరి అవకాశమని.. లాస్ట్‌ చాన్స్‌ ఇవ్వాలని చెప్తూనే.. సుమారు 50 ఏళ్లుగా తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నానని.. పార్టీకి సుదీర్ఘ సేవలు చేశానని చెప్పుకుంటున్నారు. పదవులు అనుభవించి ఆ తర్వాత ఎంతోమంది పార్టీ నుంచి వెళ్లిపోయినా.. తాను మాత్రం పార్టీనే నమ్ముకుని.. పార్టీ కోసం పని చేశానని.. చేస్తున్నానని గుర్తు చేస్తున్నారు హనుమంత రావు.

ఎన్నో త్యాగాలు చేశా.. అవకాశాలను కోల్పోయా..

పార్టీ కోసం తాను ఎన్నో త్యాగాలు చేశానని.. మరెన్నో అవకాశాలను కోల్పోయానని.. కాంగ్రెస్ కీలక నేతల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వీహెచ్‌. నిజానికి ఖమ్మంలో రాజీవ్‌ గాంధీ విగ్రహం ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారు. అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని రెండుసార్లు ప్రయత్నించారు కూడా ! ఐతే రెండుసార్లు ఆయనకు నిరాశే ఎదురైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అంబర్‌పేట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డ వీహెచ్‌.. సీఎం రేవంత్‌ సన్నిహితుడు రోహిన్ రెడ్డి కోసం తప్పుకున్నారు. ఇలా చాలా సందర్భాల్లో పోటీ చేయాలనుకున్నా.. పార్టీ కోసం త్యాగం చేశానని.. గత విషయాలను గుర్తు చేస్తున్నారట వీహెచ్‌.

వయసును దృష్టిలో పెట్టుకుని రాజ్యసభ పదవి ఇవ్వాలని విన్నపం..!

తాను పార్టీకి వీర విధేయుడినని.. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నానని వీహెచ్ చెప్తున్నారు. ఈ వయసులోనూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటున్నానని, గత పదేళ్లలో తనపై 16 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారాయన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిలో.. ఎంతో మందికి పదవులు ఇచ్చారని.. కానీ తాను ఏనాడు ఏ పదవి అడగలేదని అంటున్నారట వీహెచ్. తన వయసును దృష్టిలో పెట్టుకుని.. ఆఖరిసారి రాజ్యసభ పదవి ఇవ్వాలని కోరుతున్నారు VH. దీనికోసం ఢిల్లీ వెళ్లి.. నాలుగు రోజులు మకాం వేసి మరీ సోనియా, రాహుల్‌, ఖర్గే లాంటి వారికే కాదు.. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి కూడా వరుసగా విన్నపాలు వినిపించుకుంటున్నారట.

ఇకపై ఎప్పుడూ ఏ పదవి అడగను..!

డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరానికి హాజరయ్యేందుకు తెలంగాణకు వచ్చిన రాహుల్‌గాంధీని కలిసిన వీహెచ్‌.. తనకు ఆఖరిసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈసారి తనకు అవకాశం కల్పిస్తే.. ఇకపై ఎప్పుడూ ఏ పదవి అడగనని చెప్పారట. దీంతో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల్లో.. అధిష్టానం కోటా నుంచి ఒకటి అభిషేక్ సింఘ్వీకి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా.. రెండో సీటును ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ కనిపిస్తోంది. లాస్ట్ ఛాన్స్ ప్లీజ్ అంటున్న హన్మంతన్నకు అధిష్టానం పెద్దలు అవకాశం కల్పిస్తారా లేదా అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Also Read: ఏపీ పేరు మార్పు అసలు సాధ్యమేనా? కూటమి సర్కార్‌ దీనికి సిద్ధంగా ఉందా?