Telugu Naadu: ఆంధ్రప్రదేశ్ పేరు మార్పు అసలు సాధ్యమేనా? కూటమి సర్కార్ దీనికి సిద్ధంగా ఉందా?
కేరళ మాత్రమే కాదు.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా తమ అస్తిత్వాన్ని రుజువు చేసుకుంటూ.. ఏనాడో పేరు మార్చుకున్నాయ్. దీంతో ఆంధ్రప్రదేశ్‌ను కూడా తెలుగునాడుగా మార్చాలనే డిమాండ్‌పై చర్చ జరుగుతోంది. పేరు మార్చాల్సిందేనని భాషాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
Representative Image (Image Credit To Original Source)
- ఏపీని తెలుగునాడు మార్చాలనే డిమాండ్..
- గరికపాటి వ్యాఖ్యలతో కొత్త సంచలనం..
- ఆంధ్రప్రదేశ్ పేరు మార్పుపై అతిపెద్ద చర్చ..
- ఏపీ పేరు మార్పు అసలు సాధ్యమేనా ?
- పేరు మార్పు.. కూటమి సర్కార్‌కు ఓకేనా?
Telugu Naadu: తెలుగు జాతి మనది.. నిండుగా వెలుగు జాతి మనది. రాష్ట్రాల పేరు చర్చకు వస్తే.. మన తెలుగోళ్ల మదిలో టక్కున మెదిలో మాట ఇది. రాష్ట్రాల పేర్లను మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న వేళ.. ప్రవచనకర్త గరికపాటి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయ్. ఏపీ పేరును తెలుగునాడుగా మార్చాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. మరి ఇది సాధ్యమేనా.. కూటమి సర్కార్ దీనికి సిద్ధంగా ఉందా.. ఇంతకుముందు జరిగిన ప్రయత్వనాలు ఏంటి.. చరిత్ర ఏం చెప్తోంది.
జనాల ఆకాంక్ష మేరకు.. కేరళ పేరును కేరళంగా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరును కూడా మార్చాలనే డిమాండ్లు మొదలయ్యాయ్. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న పేరును.. తెలుగునాడుగా మార్చేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయ్. ఐతే ఇప్పుడు అవి మళ్లీ తెరమీదకు వస్తున్నాయ్. కేరళం అనేది మళయాళ భాషలో ఉన్న పేరు. అది భాషకు ఇచ్చిన గౌరవం. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ కూటమి భాషను గౌరవించుకుంటూ పేరు మార్చుకోగా.. దానికి ఎన్డీయే సర్కార్ ఆమోదం తెలిపింది. కేరళ మాత్రమే కాదు.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా తమ అస్తిత్వాన్ని రుజువు చేసుకుంటూ.. ఏనాడో పేరు మార్చుకున్నాయ్. దీంతో ఆంధ్రప్రదేశ్‌ను కూడా తెలుగునాడుగా మార్చాలనే డిమాండ్‌పై చర్చ జరుగుతోంది. పేరు మార్చాల్సిందేనని భాషాభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్లా.. ఆంధ్రప్రదేశ్ ఏంటి?
అమలాపురం కోనసీమ జిల్లాలో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహా సభలలో.. మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్లా.. ఆంధ్రప్రదేశ్ ఏంటన్నారు.. ఈ పేరులో తెలుగు లేదని.. పేరు మార్చాలని కోరారు. అంతేకాదు తెలుగు నాడు అనే పేరుని సూచించారు. దాని వెనక ఉన్న చరిత్రను కూడా చెప్పారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నపుడు ఈ ప్రతిపాదన చేశారని.. దీంతో ఏపీ పేరును తెలుగునాడుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు చుట్టూ చర్చ మొదలైంది. పేరు మార్పు సాధ్యమేనా.. కూటమి సర్కార్‌కు అంగీకారమేనా.. అసలు గతంలో ఎన్టీఆర్ సర్కార్ ప్రతిపాదన ఏంటనే డిస్కషన్ నడుస్తోంది.
అప్పట్లో ప్రతీ పథకానికి తెలుగు పేరు పెట్టిన ఎన్టీఆర్..
1983 నుంచి 1989 వరరకు అధికారంలో ఉన్న ఎన్టీఆర్.. అప్పట్లో ప్రతీ పథకానికి తెలుగు పేరు పెట్టారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. పాలనలో తెలుగుకు పెద్ద పీట వేశారు. ఆంధ్రప్రదేశ్ పేరును.. తెలుగునాడుగా మార్చాలనే ప్రయత్నాలు కూడా చేశారనే ప్రచారం ఉంది. కారణాలు ఏవైనా.. అది ఆలోచన దశలోనే ఆగిపోయిందనేది చాలామంది అభిప్రాయం. నిజానికి ఇప్పుడు గరికపాటి చెప్పింది కూడా అదే ! అప్పట్లో కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేకపోవడంతోనే.. పేరు మార్పు సాధ్యం కాలేదని.. ఇప్పుడా పరిస్థితి లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి.. కేంద్రంలోని ఎన్డీయేలో కీలకంగా వ్యవహరిస్తోంది. దీంతో పేరు మార్పు పెద్ద విషయం కాకపోవచ్చు అనేది మరికొందరి వాదన.
రామాయణ కాలం నుంచి ఆంధ్ర పదం ఉందన్న కమలానంద..
టీడీపీ తలుచుకుంటే.. ఏపీ పేరును తెలుగు నాడుగా మార్చడం పెద్ద విషయం కాదు అనే చర్చ నడుస్తోంది. పైగా తెలుగు అస్థిత్వానికి ఎంతో విలువ గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. అదే జరిగితే టీడీపీకి పొలిటికల్ మైలేజ్ వస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. రాష్ట్రం పేరు మార్పుకు సంబంధించి.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశాలు కూడా ఉండవనేది మరికొందరి వాదన. దీంతో కూటమి సర్కార్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఇక పేరు మార్పు వ్యవహారంలో.. గరికపాటి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. భువనేశ్వరి పీఠాధిపతి స్వామి కమలానంద భారతి దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా.. రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనే పదం ఉందంటూ గుర్తు చేస్తున్నారు. దీంతో పేరు మార్పు వ్యవహారం.. ఏపీలో టాక్ అఫ్ ది స్టేట్‌గా మారింది.
