Kavitha Political Party: టీఆర్ఎస్.. కవిత పార్టీ పేరు ఇదేనా? రాజకీయవర్గాల్లో ఉత్కంఠ.. బీఆర్ఎస్‌లో గుబులు దేనికి?

దేశవ్యాప్తంగా రాజకీయం చేయాలన్న ఎజెండాతో 2022 చివరిలో టీఆర్ఎస్‌ను కాస్త బీఆర్ఎస్‌గా మార్చారు కేసీఆర్. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది.

  • Published On : April 6, 2026 / 10:10 PM IST
  • పాత పేరు..కొత్త ఎజెండా అంటున్న కవిత
  • పాత పేరు అన్నారంటే టీఆర్ఎస్ గురించేనా?
  • పార్టీ పేరు టీఆర్ఎస్‌ అని వచ్చేలా ప్లాన్ చేస్తున్నారా?
  • కవిత పెట్టబోయే పార్టీ బీఆర్ఎస్‌కు నష్టం చేస్తుందా?
  • టీఆర్ఎస్‌ పేరును వాడుకునే అవకాశం ఉందా? లేదా?

Kavitha Political Party: వడపోత అయిపోయింది. ప్రకటన ఒకటే మిగిలి ఉంది. మంచి ముహూర్తం..సరైన టైమ్ చూసి రాజకీయ పార్టీ పేరు, జెండా, అజెండాపై ప్రకటన చేయబోతున్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. ఈ క్రమంలోనే పాత పేరు..కొత్త ఎజెండా అంటూ ఆమె చేసిన కామెంట్స్..ఇంట్రెస్టింగ్ డిస్కషన్ పాయింట్‌గా మారాయి. పాత పేరు అన్నారంటే అది టీఆర్ఎస్ గురించేనా? కవిత ప్రకటించబోయే పార్టీ పేరు టీఆర్ఎస్‌గా ఉండబోతోందా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సొంతంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఆమె పెట్టబోయే పార్టీ వివరాలను ఈ నెల 25న ప్రకటిస్తారు. ఈ క్రమంలో కవిత పార్టీ పేరు, జెండాపై తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే మీడియాతో చిట్ చాట్‌లో కవిత చెప్పిన విషయాలు బీఆర్ఎస్‌లో కలవరానికి దారితీస్తున్నాయట. దానికి ప్రధాన కారణం కవిత పెట్టబోయే పార్టీ పేరనే చెప్పాలి. పార్టీ పేరు విషయంలో మొదటిసారి నోరు విప్పిన కవిత.. పాత పేరు కొత్త ఎజెండాతో వస్తున్నట్లు కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తన పార్టీ పేరు టీఆర్ఎస్ కూడా కావచ్చేమో అంటూ కవిత వ్యాఖ్యానించడం బీఆర్ఎస్ పార్టీలో గుబులు పుట్టిస్తోందట.

2022లో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్..

తెలంగాణ రాష్ట్ర సమితి-టీఆర్ఎస్ 2001లో ఏర్పడింది. ఆ పేరుతోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ప్రత్యే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా రాజకీయం చేయాలన్న ఎజెండాతో 2022 చివరిలో టీఆర్ఎస్‌ను కాస్త బీఆర్ఎస్‌గా మార్చారు కేసీఆర్. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అయితే బీఆర్ఎస్‌గా మార్చినప్పుడే టీఆర్ఎస్ పేరు ఫ్రీజ్ అయింది. మళ్లీ ఆ పేరు తీసుకునే అవకాశం లేదనే విషయంపై కూడా కవిత స్పందించారు. ఏ పార్టీ పేరైనా రెండు సంవత్సరాలు మాత్రమే ఫ్రీజ్ అయి ఉంటుందని, ఆ తర్వాత ఆ పేరును వేరే వాళ్లు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు కవిత. ఇదే సమయంలో తమ పార్టీ పేరు కోసం ఒక స్పెషల్‌ టీమ్‌ ప్రత్యేకంగా పని చేస్తుందని చెప్పారు.

టీఆర్ఎస్.. జీవితకాలంలో ఎవరికీ కేటాయించే అవకాశం లేదా?

టీఆర్ఎస్ పేరును కవిత తన పార్టీ పేరుగా పెట్టుకోబోతున్నారన్న గుసగుసలు..బీఆర్ఎస్‌లో కలవరం సృష్టిస్తున్నాయట. అయితే కొందరు కారు పార్టీ నేతలు మాత్రం..టీఆర్ఎస్ పేరును కవిత వాడుకోలేరని చెబుతున్నారు. టీఆర్ఎస్ పేరు మళ్లీ తాము కావాలంటేనే వస్తుంది కానీ ఇతరులకు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ పార్టీ జీవితకాలంలో ఎవరికీ కేటాయించే అవకాశం లేదని ఇంకొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే పేరును తాము కావాలి అని కోరుకున్నా సరే వచ్చే పరిస్థితి లేదని తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంత కఠినమైన నిబంధనలున్న ఈ టైమ్‌లో టీఆర్ఎస్ పార్టీ పేరును కవితకు కేటాయించే ఛాన్సే లేదని అంటున్నారు.

టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారిన తర్వాతే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని తెలంగాణ ప్రజల్లోనే కాదు..బీఆర్ఎస్‌లోనూ కొన్ని రోజుల పాటు చర్చ జరిగింది. తెలంగాణలో ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్.. తెలంగాణ అన్న పదం లేకపోవడంతో చాలామంది లీడర్లు, పార్టీ క్యాడర్ నిరాశ చెందారని అంటుంటారు. మళ్లీ టీఆర్ఎస్ అని మార్చాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే టీఆర్ఎస్‌గా మార్చే అవకాశం లేదని..బీఆర్ఎస్‌గానే కంటిన్యూ అవుతుందని కేసీఆర్‌ చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు గులాబీ లీడర్లు.

25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న కవిత..

ఈ నేపథ్యంలో ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న కవిత ఏం పేరు పెట్టబోతున్నారన్నది ఇటు బీఆర్ఎస్‌లో, అటు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనకు టచ్‌లో ఉన్నారని, సమయానుకూలంగా వారు తన పార్టీలో చేరతారని కవిత చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో కీలకంగా ఉండి వచ్చిన కవితకు అక్కడున్న లోటుపాట్లన్నీ తెలుసు కాబట్టి ఆమె రాజకీయ వ్యూహాలన్నీ బీఆర్ఎస్ కేంద్రంగా ఉండే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

Also Read: తమిళనాడులో సంచలనం.. 9 మంది పోలీసులకు మరణశిక్ష