Representative Image (Image Credit To Original Source)
Karimnagar District: అధికార పార్టీ నేత ఇలా చెప్తే.. అలా పని అయిపోవాలి. కానీ ఆ జిల్లాలో మాత్రం పరిస్థితి అలా లేదట. మంత్రులు, ఎమ్మెల్యేల ఆదేశాలను కూడా ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారట. అంతేకాదు కొన్నిసార్లు ప్రతిపక్ష నేతల మాటే చెల్లుబాటు అవుతుందనే టాక్ వినిపిస్తోంది. గత సర్కార్ హయాంలో ఎమ్మెల్యే చెప్తే అయిన పనులు..ఇప్పుడు నాలుగుసార్లు మంత్రే ఫోన్ చేసినా అవట్లేదట. గత ప్రభుత్వంలో గప్ చుప్ మనకుండా పనిచేసిన అధికారులు..ఇప్పుడు హస్తం పార్టీ నేతలను పట్టించుకోవట్లేదట. ఇంతకు ఇదంతా ఎక్కడ? ఆఫీసర్లకు, అధికార పార్టీ నేతలకు ఎక్కడ గ్యాప్ వచ్చింది?
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు గుట్టు చప్పుడు కాకుండా పని చేశారు. అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రుల మాట జవ దాటకుండా పని చేసి శభాష్ అనిపించుకున్నారు. అయితే ప్రభుత్వం మారినా ఇప్పటికీ కొందరు అధికారులు బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్నారట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో సిరిసిల్ల, కోరుట్ల, హుజురాబాద్ మినహాయిస్తే..మిగితా చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికి.. కాంగ్రెస్ తోనే దోస్తీ చేస్తున్నారు.
ఇక ఉమ్మడి జిల్లా నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రులుగా, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విప్ గా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ, కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రి బండి సంజయ్ యాక్టీవ్‌గా పనిచేస్తున్నారు. అయితే అధికార పార్టీ బలం ఎక్కువగానే ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పిన మాటే చెల్లుబాటవుతుందనే మాట వినిపిస్తుంది.
స్వయంగా జిల్లా కలెక్టర్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలను, మంత్రులను లైట్ తీసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా పని కోసం ప్రజలు.. ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గరికి వెళ్తే వెంటనే అధికారులకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. వెళ్లి కలవండి…పని అయిపోతుందని చెబుతున్నారు. తీరా అధికారి దగ్గరికి వెళ్తే తప్ప జనాలకు అధికార పార్టీ నేతల పతారే ఏంటో తెలియట్లేదట. సమస్య ఏదైనా పెండింగ్ లో పెట్టేస్తున్నారట.
సంబంధిత శాఖ మంత్రి ఫోన్లు చేసిన పనులు కావడం లేదట..!
చేద్దాం…చూద్దాం అంటు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారట. రాష్ట్రంలోనే పవర్ పుల్ మినిస్టర్ చెప్పినా సొంత జిల్లాలో పనులు కావడం లేదట. మంత్రి ఫోన్ చేయడం..జనాలు వెళ్లి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడమే సరిపోతుందట. సంబంధిత శాఖ మంత్రి ఫోన్లు చేసిన పనులు కావడం లేదట. ఎమ్మెల్యేలు, మంత్రులు వందల ఫోన్లు చేస్తారు…అవన్ని చేస్తామా అనేది ఓ కలెక్టర్ గారి నోటి వెంట వచ్చిన మాటగా జిల్లాలో చర్చ జరుగుతుంది.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా సందీప్ కుమార్ ఝా ఉన్నప్పుడు.. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రోటోకాల్ ఇష్యూ నడిచింది. చివరకు విప్ ఆది శ్రీనివాస్.. సీఎంకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై బదిలీ వేటు పడింది. ఇక కరీంనగర్ జిల్లా అధికారులు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలు తమ నాయకత్వానికి మొర పెట్టుకున్నారట. మనం పవర్ లో ఉన్నామో? లేదా ప్రతిపక్షంలో ఉన్నామో? తెలియట్లేదని అంతర్గత సమావేశాల్లో వాపోతున్నారట.
అధికార పార్టీకి ఎందుకు అధికార యంత్రాంగం అనుకూలంగా వ్యవహరించడం లేదనే అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది. గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి..ప్రతి శాఖలో ఏం జరుగుతుందనేది అబ్జర్వ్ చేస్తుండే వారు. రివ్యూ మీటింగ్ లో శాఖల తప్పిదాలను కడిగి పడేసే వారు. తప్పు జరిగితే అక్కడికక్కడే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చే వారు. ఇలాంటి చర్యలతో అధికారుల్లో సహజంగానే భయం ఉండేందంటున్నారు. అందుకే ఎందుకొచ్చిన తలనొప్పి అనుకునేవారేమో గాని..ఎమ్మెల్యే ఫోన్ చేసిన చిటికెలో పనులయ్యేవట.
ప్రస్తుతం పెద్దగా సమీక్షలు లేకపోవడం…ఒకవేళ రివ్యూ మీటింగ్ పెట్టినా మమ అనిపిస్తున్నారట. నామమాత్రపు సమీక్షలతో కలెక్టర్లు ఇచ్చిందే ఫైనల్ రిపోర్ట్ అన్నట్లుగా ఉందట పరిస్థితి. కేవలం పోలీస్ పోస్టింగ్ ల విషయంలో మాత్రమే మంత్రులు, ఎమ్మెల్యే మాట చెల్లుబాటువుతుందట. ఆ శాఖ అధికారులే ..అధికార పార్టీ నేతలు చెప్పిన మాటలు తూచూ తప్పకుండా పాటిస్తున్నారట. ఇదిలా ఉంటే కొంతమంది పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లీక్ లిస్తున్నారన్న చర్చ లేకపోలేదు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి…కరీంనగర్ సీపీ గౌస్ ఆలంపై బహిరంగ ఆరోపణలు చేయడానికి కోవర్టు పోలీసులే కారణమంటూ ఓ వర్గం అధికారుల్లో చర్చ సాగుతుంది. ఏదైనా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే చెబితే అయిన పనులు…ఈ ప్రభుత్వంలో మంత్రి ఆదేశించినా పూర్తి కావడం లేదన్నది మాత్రం ఓపెన్ సీక్రెట్ అంటున్నారు. మరి అధికార పార్టీ నేతల అలర్ట్ అయి ఇప్పటికైనా శాఖల మీద..పాలన వ్యవహారాలపై పట్టు పెంచుకుని పైచేయి సాధిస్తారో లేక ఎప్పటిలాగే మాట చెల్లుబాటు కాక అసంతృప్తితో రగిలిపోతారో చూడాలి.