Elkathurthi Woman Killed Case : కారు డిక్కీలో మహిళ మృతదేహం.. వీడిన మిస్టరీ.. కూతురిపై కోపంతో తండ్రే ప్లాన్..!

Elkathurthi Woman Killed Case : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభించిన ఘటనలో మిస్టరీ వీడింది.

Elkathurthi Woman Killed Case

Elkathurthi Woman Killed Case : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభించిన ఘటనలో మిస్టరీ వీడింది. పోలీసులు అన్నికోణాల్లో విచారణ పూర్తి చేసిన తరువాత పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి చేయడంతోనే ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు.. ప్రియుడికి మహిళ తండ్రి ప్రోత్సహం అందించాడని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రియుడు వినోద్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేయగా.. మృతురాలి తండ్రి రాజేశం కోసం గాలిస్తున్నారు.

Also Read : AE Nookaraju Family Case : సాధిక్‌ఖాన్‌ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి.. ప్రొటీన్ పౌడర్‌లో సైనైడ్ కలిపి.. గడ్డం తీసేసి..

ఈనెల 21వ తేదీన ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలోని మార్కెట్ చెక్ పోస్టు వద్ద రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు కారు డిక్కీ తెరిచి చూశారు. అందులో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎల్కతుర్తి పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కారు నంబర్ ఆధారంగా మృతురాలిని పెద్దపల్లి జిల్లా రాయగిరి మండలం రత్నాపూర్‌లోని సెంటినరీ కాలనీకి చెందిన అంకతి మానస (33)గా గుర్తించారు. నిందితుడు ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన ఎడెళ్లి వినోద్‌కుమార్ (33)గా గుర్తించారు. ఆదివారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మృతురాలి తండ్రి రాజేశం, నిందితుడి తండ్రి సమ్మారెడ్డి గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి మైనింగ్‌లో పనిచేశారు. ఒకే కాలనీలో నివసించడంతో మానస, వినోద్‌కుమార్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. మానసకు గతంలో వివాహం కాగా.. భర్త నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం మరో వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ అతడిపై కోర్టులో కేసు వేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

ఈ క్రమంలో వినోద్‌కుమార్‌తో మానసకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో.. తమ మాట వినడం లేదని మానసపై తండ్రి రాజేశం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 16న అరుణాచలం వెళ్తున్నానని చెప్పి మానస ఇంటి నుంచి బయటకు వెళ్లింది. 18న తల్లిదండ్రులకు ఫోన్ చేసి కరీంనగర్‌లో వినోద్‌కుమార్ అద్దె ఇంట్లో ఉన్నట్లు తెలిపింది. తనను పెళ్లి చేసుకోవాలని మానస పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని వినోద్‌కుమార్ మానస తండ్రి రాజేశానికి తెలిపాడు.

మానస బతికుంటే తమతో పాటు నిన్ను కూడా ఇబ్బందులకు గురిచేస్తుందని.. ఏదో ఒకటి చేసి సమస్య లేకుండా చేయాలని రాజేశం వినోద్ కు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. మానస తండ్రి మాటలతో ప్రేరేపితుడైన వినోద్‌కుమార్ మానస గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. వినోద్ కుమార్ ను పోలీసులు సోమవారం కోర్టు హాజరుపర్చగా.. రాజేశం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.