Harish Rao: ప్రభుత్వ భూముల కేటాయింపులపై హరీశ్ రావు ఫైర్.. సీఎం రేవంత్ రెడ్డికి సంచలన లేఖ
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాస్తూ ప్రభుత్వ భూములను ధారాదత్తం చేసే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
- V Santhosh Kumar
- Published on- August 30, 2026 / 04:47 PM IST
Harish rao sensational letter to cm revanth reddy about government lands
- సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు హెచ్చరిక
- రూ.500 కోట్ల భూమి కేటాయింపు
- ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ ఏజెన్సీ
Harish Rao: తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులు, భూముల కేటాయింపుల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం విలువైన ప్రజా ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరలకే అప్పగిస్తోందని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఒక లేఖ రాస్తూ, ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారత ప్రజలకే అంకితమన్న ప్రధాని
ఆజామాబాద్ భూముల కేటాయింపుపై తీవ్ర ఆరోపణలు:
హైదరాబాద్‌లోని అత్యంత విలువైన ఆజామాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకంపై హరీశ్ రావు(Harish Rao) లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడ రూ.500 కోట్ల భారీ మార్కెట్ విలువ కలిగిన ప్రభుత్వ భూమిని కేవలం రూ.87 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘ఆయిల్‌ఫెడ్’ సదరు రూ.87 కోట్లు చెల్లించి ఆ భూమిని తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, దానిని పక్కన పెట్టి మరీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు.
రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా ప్రభుత్వం:
ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయిందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా ప్రైవేట్ శక్తులకు తెగనమ్మడం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలోనే కాకుండా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామని ఈ లేఖ ద్వారా హెచ్చరించారు.
