Harish Rao : ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలకు హరీశ్ రావు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. ఈ కార్ రేసింగ్ ఒప్పందం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. ఈ కార్ రేసులో 600 కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేసుకున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ చెప్పినట్లు రూ.600 కోట్ల నష్టం కాదు లాభం జరిగేదని అన్నారు. సీఎం రేవంత్ తుగ్లక్ నిర్ణయం వల్ల తెలంగాణకు రూ.600 కోట్ల నష్టం జరిగిందన్నారు హరీశ్ రావు.
”మన రాష్ట్రం ప్రతిష్టను, గౌరవాన్ని ప్రపంచపటంలో నిలిపే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఇటీవల తమిళనాడు రాష్ట్రం ఫార్ములా 4 రేస్ నిర్వహించింది. అందుకోసం రూ.42 కోట్లు ఖర్చు పెట్టింది. అది కూడా తప్పేనా? అదే విధంగా యూపీ ప్రభుత్వం రూ.1700 కోట్లు ఖర్చు పెట్టి ఫార్ములా వన్ రేస్ నిర్వహించింది. అది కూడా తప్పేనా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు 103 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించారు. అది కూడా తప్పేనా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ.. 70వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించారు. అదొక పెద్ద కుంభకోణంగా తర్వాత తేలింది. అది కూడా తప్పేనా?
సభలో మమ్మల్ని మాట్లాడనివ్వలేదు. సభలో ఉండి ఉంటే అక్కడే నిజాలు చెప్పే వాళ్లము. ఈ కార్ రేసింగ్ వల్ల తెలంగాణకు లాభం జరిగింది. ఈ కార్ రేస్ ఒప్పందంలో అవినీతే జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అవినీతే జరగనప్పుడు ఏసీబీ ఎలా విచారణ జరుపుతుంది? సీఎం రేవంత్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు” అని విరుచుకుపడ్డారు హరీశ్ రావు.
Also Read : కేటీఆర్ అరెస్ట్ జరిగితే బీఆర్ఎస్ ను లీడ్ చేసేదెవరు? కారు స్టీరింగ్ ఆ ఇద్దరిలో ఎవరికి..?