HMWSSB Fake Jobs Post : ‘హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలు.. నెలకు రూ.52 వేల జీతం’.. కఠిన చర్యలు తప్పవంటున్న జలమండలి
HMWSSB Fake Jobs Post : హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలంటూ వైరల్ అవుతున్న పోస్ట్ పై జలమండలి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
- Dharani Pilli
- Updated on- May 20, 2026 / 11:53 AM IST
hmwssb reacts on water board recruitment notification 2026 viral in social media clarify its fake
- హైదరాబాద్ వాటర్ బోర్డులో ఉద్యోగాలంటూ ప్రకటన
- అదంతా తప్పుడు సమాచారం అన్న జలమండలి
- ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు
HMWSSB Fake Jobs Post : మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు ఇప్పిస్తాం.. విదేశాల్లో కూడా జాబులు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి నిరుద్యోగులను బురిడీ కొట్టించి కోట్లలో డబ్బులు లాగి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తున్న కంపెనీల గురించి నిత్యం వార్తలు వెలుగు చూస్తుంటాయి. అయితే తాజాగా ఇందుకు భిన్నమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఏకంగా హైదరాబాద్ జలమండలిలో ఉద్యోగాలు, నెలకు రూ.52 వేల జీతం అంటూ కొన్ని రోజులుగా ఓ నోటిఫికేషన్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది కాస్త జలమండలి అధికారులు దృష్టికి వచ్చింది. దీంతో వారు ఇది ఫేక్ నోటిఫికేషన్ అని తేల్చి చెప్పారు. ఇటువంటి తప్పుడు వార్తలను నమ్మి ఎవరూ మోసపోవద్దని జలమండలి అధికారిక ప్రకటన విడుదల చేసింది.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో “హైదరాబాద్ నీటి సరఫరా బోర్డు, తెలంగాణ రిక్రూట్మెంట్ 2026” అనే క్యాప్షన్ తో ఒక పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. దీనిలో జలమండలిలో భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారని.. దానికి కావాల్సిన అర్హతల వివరాలతో పాటు నెలకు రూ. 52 వేలకు పైగా జీతం అంటూ వివరాలు పొందుపరిచారు. ఇది నిజమైన నోటిఫికేషనే అని భావించి అభ్యర్థులు గందరగోళానికి గురవుతుండటంతో బోర్డు రంగంలోకి దిగింది.
*ఐటీ ఉద్యోగులకు భారీషాక్.. భారత ఐటీ రంగానికి ముప్పు తప్పదా? సాఫ్ట్‌వేర్ ఉచితం కాబోతోంది..
దీనిపై స్పందిస్తూ.. సోషల్ మీడియా పోస్టర్‌లో చూపిస్తున్నట్లుగా జలమండలిలో ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగడం లేదని.. ఇదంతా ఫేక్ అని స్పష్టం చేసింది. అంతేకాక జలమండలిలో ఉద్యోగాలను భర్తీ చేయాల్సి వస్తే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) లేదా ఇతర గుర్తింపు పొందిన ప్రభుత్వ అధికారిక సంస్థల ద్వారా మాత్రమే చేపడతారని స్పష్టం చేసింది.
* రాత పరీక్ష లేకుండానే ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.34 వేల జీతం.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు
ఉద్యోగాలకు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారమైనా ప్రభుత్వ లేదా జలమండలి అధికారిక వెబ్‌సైట్లలో, గుర్తింపు పొందిన ప్రధాన పత్రికలు, మీడియా మాధ్యమాల్లో మాత్రమే విడుదల అవుతుందని ఈ సందర్భంగా మరోసారి వెల్లడించింది. అలానే ఉద్యోగాల పేరుతో ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుద్యోగులను ఆశకు గురిచేస్తూ ఇలాంటి తప్పుడు నియామక వార్తలను సృష్టించి, ప్రచారం చేసే కేటుగాళ్లను గుర్తిస్తామని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
అలానే నిరుద్యోగులు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక పోస్టర్లను నమ్మి వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని, కేవలం అధికారిక ప్రకటనలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని జలమండలి కోరింది.
