HMWSSB Illegal Motors : మీరు కూడా నల్లాకి మోటర్ పెట్టి లాగుతున్నారా?.. మీకు కూడా వీళ్లకు పట్టిన గతే పడుతుంది..

HMWSSB Illegal Motors : నగరంలో నల్లాలకు అక్రమంగా మోటార్లు బిగించే వారికి జలమండలి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

hyderabad hmwssb vigilance teams seized 7 illegal motors they directly attached to top pipelines in srnagar

  • హైదరాబాద్ వాసులకు జలమండలి అలర్ట్
  • నల్లాకు మోటార్ అక్రమంగా మోటార్ బిగిస్తే
  • జరిమానాతో పాటు కేసు కూడా నమోదు

HMWSSB Illegal Motors : వేసవి కాలం ప్రారంభం కాకముందే.. అంటే ఫిబ్రవరి నెలాఖరు నుంచే హైదరాబాద్ నగరంలో నీటి ఎద్దడి మొదలవుతుంది. జలమండలి వారే నీటి సరఫరా సమయాన్ని తగ్గిస్తారని సమాచారం. దీనికి తోడు చాలా మంది తమ ఇళ్లలో నల్లాకు మోటార్లు బిగించి.. నీటిని మొత్తం లాగేస్తారు. దీంతో మిగతావారు తీవ్రమైన నీటి కొరతతో ఇబ్బంది పడే పరిస్థితి. ఈ క్రమంలో నల్లాకు అక్రమ మోటార్లు బిగించే వారికి జలమండలి హెచ్చరికలు జారీ చేసింది. అలాంటి వారికి జరిమానా విధించడంతో పాటు కేసు నమోదు చేస్తామని కూడా తెలిపింది. తాజాగా జలమండలి విజిలెన్స్ అధికారులు కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. పైపులైనుకు అక్రమంగా బిగించిన మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి ఎక్స్ (X) వేదికగా వారు ఒక పోస్ట్ చేశారు.

జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మహానగరానికి జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు తమ నల్లాలకు మోటార్లు బిగించుకోవడం జలమండలి అధికారుల దృష్టికి వచ్చింది. దీనివల్ల మిగిలిన వినియోగదారులకు.. లో-ప్రెజర్‌తో నీటి సరఫరా జరుగుతోంది. ఇలా చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడానికి గాను జలమండలి విజిలెన్స్ అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

నల్లా లెక్కలు తేలుస్తారు : జలమండలి ఇంటింటి సర్వే

ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-6, ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఎస్ఆర్టీ కాలనీలో నల్లాకు మోటార్లు బిగిస్తున్నారని స్థానికులు జలమండలి విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. దీనిపై స్పందించిన అధికారులు బుధవారం నీటి సరఫరా సమయంలో ఆ ప్రాంతంలో పర్యటించి పైపులైనుకు అక్రమంగా బిగించిన 7 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తారు. రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తారు. కాబట్టి వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది.

HMWSSB Water Tankers : ట్యాంకర్‌లలో నీటిని బుక్ చేసే వారికి జల మండలి కీలక అలర్ట్.. అలాంటి వారంతా జైలుకే

ఈ సందర్భంగా జలమండలి అధికారులు కీలక ప్రకటన చేశారు. ఒకవేళ ఏ ప్రాంతంలో అయినా తక్కువ ప్రెజర్‌తో నీరు సరఫరా అయినా.. లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా.. తమకు దగ్గర్లోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలి. లేదా జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తారు.