×
Ad

LPG Gas Shortage Hyderabad : హైదరాబాద్ హోటళ్లలో పూరీ, దోశ, వడ బంద్.. మూతపడుతున్న రెస్టారెంట్లు, హాస్టళ్లు..!

LPG Gas Shortage Hyderabad : నగరవాసులకు అలర్ట్.. ఇకపై హోటళ్లలో పూరీ, వడ, దోశ లాంటి టిఫిన్లు కనిపంచవు.. కారణం ఏంటంటే..

hyderabad hotels stops dosa puri Vada and reduce menu due to lpg gas shortage and few of them temporarily shut down

LPG Gas Shortage Hyderabad :

పశ్చిమాసియా సంక్షోభం మన దేశంలోని హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ సిలిండర్ల సరఫరా బాగా తగ్గింది. దీంతో గత రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో హోటళ్లను తాత్కాలికంగా మూసి వేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పరిస్థితిని పునరుద్ధరించకపోతే.. తమ వ్యాపారాలు మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ సరఫరా తగ్గడంతో హోటళ్లు, హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో టీ దుకాణాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. అలానే చాలా హోటళ్లు వండేందుకు అధిక సమయం తీసుకునే.. ఎక్కువ నూనె అవసరమయ్యే పూరీ, దోశ, చపాతీ వంటి వాటిని తాత్కాలికంగా బంద్ చేశారు. పరిస్థితి మెరుగుపడితేనే వీటిని తిరిగి మెనూలో చేర్చుతామని తెలిపారు.

నగరంలో అనేక ప్రాంతాల్లో టిఫిన్ బండ్లు వెలిశాయి. ఇక ప్రతి గల్లీకో హోటల్ తప్పనిసరి. అయితే ఇప్పుడవన్నీ మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ వంట చేయడానికి పూర్తిగా గ్యాస్‌పైనే ఆధారపడుతున్న నేపథ్యంలో.. సరిపడా గ్యాస్ సిలిండర్ సరఫరా లేక.. వీటిని తాత్కాలికంగా మూసివేసే పరిస్థితి ఏర్పడింది. గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలు లేదా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్‌లను ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదని హోటల్ యజమానులు వెల్లడిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోని పలు హాస్టళ్లు, మెస్‌లలో వంట చేయడానికి 90 శాతానికి పైగా గ్యాస్‌నే వాడుతున్నారు. అయితే ఇప్పటికే గ్యాస్ కొరతతో మెనూలో భారీ మార్పులు చేశారు. అన్నం, పప్పు, సాంబార్, రసం మాత్రమే వండుతున్నారు. మరో రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే అవి కూడా బంద్ చేస్తామని వెల్లడిస్తున్నారు. హాస్టళ్లు, పీజీలను మూసివేయక తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. నగరంలో అశోక్ నగర్, దిల్‍సుఖ్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కేపీహెచ్‌బీ, కొండాపూర్, ఎస్సార్ నగర్ వంటి ప్రాంతాల్లో వందల సంఖ్యలో హాస్టళ్లు ఉన్నాయి. గ్యాస్ కొరత, నిత్యావసరాల ధరలు పెరగడం వీరిపై భారీగా ప్రభావం చూపుతోంది.

ఇప్పటికే హోటళ్లలో ధరలను భారీగా పెంచారు. చాలా హోటళ్లు టిఫిన్ల ధరల మీద 10 శాతం పెంచేశారు. దోశ, పూరీ, వడలపై కనీసం రూ.15 వరకు పెరిగాయి. ఇడ్లీ, ఉప్మా లాంటి వాటిపై రూ.10 పెంచారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో 15 శాతం ధరలు పెంచారు. తాము 22 ఏళ్లుగా హోటల్ నడుపుతున్నామని, మూడు రోజులుగా వాణిజ్య సిలిండర్లు లభించడం లేదని ఉప్పల్‌కు చెందిన కె.నారాయణ అన్నారు. దీంతో హోటల్‌ను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

ఇదిలా ఉంటే కేంద్రం మాత్రం దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నా.. చాలా ప్రాంతాల్లో వాటి కొరత ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల ఇప్పటికే ముంబైలో 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేసినట్లు.. నగర హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ వెల్లడించింది. ముంబైతో పాటు బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, పట్నా, అహ్మదాబాద్, నాగ్‌పూర్ నగరాలు సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పలు రెస్టారెంట్లు, హోటళ్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో మెనూలను తగ్గిస్తున్నట్లు కొన్ని హోటళ్ల నిర్వాహకులు తెలిపారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే.. హోటళ్లను తాత్కాలికంగా మూసివేస్తామని ప్రకటించారు.