Mee Ticket App : మీ టికెట్‌ యాప్‌‌తో ఎన్నో సేవలు.. మెట్రో టికెట్‌ నుంచి పార్కులు, ఆలయాల టికెట్ల వరకు అన్నీ ఇందులోనే!

Mee Ticket App : మీ టికెట్ యాప్‌తో తెలంగాణలో ఆర్టీసీ, మెట్రో, పార్కులు, దేవాలయాల టికెట్లను ఇంటి నుంచే సులభంగా బుక్ చేసుకోవచ్చు.

Mee Ticket App

Mee Ticket App : హైదరాబాద్‌లో రోజూ బస్సు, మెట్రోలో ప్రయాణించే వారికి ఇక టికెట్ల టెన్షన్‌ తగ్గనుంది. ఒకే పాస్‌తో సిటీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు.. మొబైల్‌లోనే టికెట్‌ బుక్‌ చేసుకోవడంతో పాటు వీక్లీ బస్‌ పాస్‌ కూడా తీసుకోవచ్చు. ఒకే యాప్‌, ఒకే పాస్‌తో నగర ప్రయాణం మరింత సులభం కానుంది.

Also Read : Rain Alert : బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు. భీకర గాలులు..

ఆర్టీసీ, మెట్రో రోజువారీ, నెలవారీ ఉమ్మడి పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామన్ పాస్, మీ టికెట్ మొబైల్ యాప్‌లను లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి పాస్‌లు అన్ని మెట్రో స్టేషన్‌లలో లభించనున్నాయి. ఈ పాస్‌లతో పుష్పక్ మినహా ఔటర్ రింగ్ రోడ్డు లోపల నడిచే అన్ని ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో, మెట్రో రైళ్లలో వినియోగించుకోవచ్చు.

హైదరాబాద్ నగరంలో నిత్యం బస్సులో సుమారు 25లక్షలు, మెట్రో రైళ్లలో 4.50లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. వీరిలో చాలా మంది బస్సు, మెట్రోలను వినియోగిస్తున్నారు. వీరికి రెండు సేవలను ఒకే ప్లాట్ ఫాం‌పైకి తీసుకొస్తూ ఉమ్మడి పాస్‌లను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక.. కాగితపు టికెట్లకు బదులు మీ టికెట్ మొబైల్ యాప్ సైతం అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి.

మీ టికెట్ యాప్ ద్వారా మెట్రో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తెలంగాణ ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సిటీ బస్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రదేశం, గమ్యస్థానాలను ఎంపిక చేసుకొని డిజిటల్‌ విధానంలో సులభంగా చార్జీలను చెల్లించవచ్చు. చెల్లింపు పూర్తయిన వెంటనే యాప్‌లో డైనమిక్‌ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ టికెట్‌ వస్తుంది. ప్రయాణ సమయంలో దీనిని కండక్టర్‌కు చూపిస్తే సరిపోతుంది. అంతేకాదు.. పార్కుల్లో (కేబీఆర్ పార్క్, లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, బొటానికల్ గార్డెన్, కండ్లకోయ ఆక్సిజన్ పార్క్, తెలంగాణలో ఇంకా చాలా ఉన్నాయి) ఎంట్రీకి టికెట్లు ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోచవచ్చు.

మీ టికెట్ యాప్ ద్వారా ఆలయాల్లో దర్శనాల టికెట్లు బుక్ చేసుకోవచ్చు (15 ఆలయాలు ఉన్నాయి). దుర్గం చెరువు బోటింగ్ టికెట్లు, వాటర్ పాల్స్ దగ్గర ఎంట్రీ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మ్యూజియంలకు వెళ్లడానికి క్యూలో నిలబడాల్సిన పనిలేదు. మీ టికెట్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు (తెలంగాణలో ఆరు మ్యూజియంలు ఉన్నాయి). పలు ప్రాంతాల్లో ట్రెకింగ్‌కు వెళ్లే వారు ఈ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈవీ చార్జింగ్ స్టేషన్ల లొకేషన్లు కూడా ఇందులో తెలుస్తాయి. మీకు ఎంత దగ్గరలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఉందనే సమాచారం ఉంటుంది. ఇలా పలు రకాల సదుపాయాలు మీటికెట్ యాప్‌లో అందుబాటులో ఉంచారు.