Rain Alert : బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు. భీకర గాలులు..
Rain Alert : మయన్మార్-అండమాన్ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఇది రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
AP and Telangana Rain Alert
Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో గతవారం వర్షాలు దంచికొట్టాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. అయితే, వారంరోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవైపు వర్షాలు లేక.. మరోవైపు ఎల్నినో ముప్పు పొంచిఉండటంతో సాగుచేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు శుభవార్త చెప్పింది.
వాతావరణ శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం.. మయన్మార్ – అండమాన్ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తూర్పు ఈశాన్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం 72 గంటల్లో ఈశాన్య బంగ్లాదేశ్ – బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాయుగుండం తీరం దాటే అవకాశం ఉండటంతో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
