Hash Oil Seized: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. ‘స్నాప్‌చాట్ యాప్’లో పెద్దఎత్తున.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
ప్రకాశం జిల్లాకు చెందిన బూర్సె నరేంద్ర శ్రీనివాస్ (30) డ్రైవర్‌గా పనిచేస్తూనే డ్రగ్స్(Hash Oil Seized) విక్రయాలకు అలవాటు పడ్డాడు.
- V Santhosh Kumar
- Published on- August 10, 2026 / 06:58 AM IST
Hyderabad police seized hash oil worth of 2.5 lakh
- హ్యాష్ ఆయిల్ స్వాధీనం
- స్నాప్‌చాట్ ద్వారా దందా
- పెడ్లర్ నరేంద్ర శ్రీనివాస్ అరెస్ట్
Hash Oil Seized: రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ ముఠా కలకలం సృష్టించింది. ఎంతమందిని అరెస్టు చేస్తున్నా, కొత్త దారుల్లో ఈ దందాను విస్తరిస్తూ యువతను నాశనం చేసేందుకు పెడ్లర్లు యత్నిస్తున్నారు. తాజాగా పోలీసుల కన్నుగప్పి డ్రగ్స్ అమ్ముతున్న ఓ పాత నేరస్థుడిని ఈగల్ ఫోర్స్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుండి భారీ మొత్తంలో హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, అతడి నేర పథకాన్ని భగ్నం చేశారు.
స్నాప్‌చాట్ వేదికగా రూ. 2.5 లక్షల హ్యాష్ ఆయిల్ దందా:
ప్రకాశం జిల్లాకు చెందిన బూర్సె నరేంద్ర శ్రీనివాస్ (30) డ్రైవర్‌గా పనిచేస్తూనే డ్రగ్స్ విక్రయాలకు అలవాటు పడ్డాడు. గతంలో ఎన్‌డీపీఎస్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన అతడు, ఆగస్టు 2న ఒడిశా వెళ్లి రూ.9,000కు హ్యాష్ ఆయిల్(Hash Oil Seized) కొనుగోలు చేశాడు. పోలీసులకు చిక్కకుండా స్నాప్‌చాట్ ద్వారా సరఫరాదారుడితో మాట్లాడటంతో పాటు, ముందస్తు టికెట్ లేకుండా నడుస్తున్న బస్సుల్లో ప్రయాణించాడు. హైదరాబాద్‌లో 10 మి.లీటర్లను రూ. 1,200 చొప్పున అమ్మి లాభ పడాలని ప్లాన్ చేశాడు.
పోలీసులు వేసిన పక్కా స్కెచ్:
విశ్వసనీయ సమాచారంతో ఆగస్టు 8న విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ORR వద్ద పోలీసులు నిఘా పెట్టారు. బస్సు దిగిన వెంటనే శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని, రూ. 2.5 లక్షల విలువైన 200 మి.లీ (330 గ్రాములు) హ్యాష్ ఆయిల్‌ను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ముఖ్య సరఫరాదారు హరి కోసం గాలిస్తున్నారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లల అలవాట్లపై కన్నువేసి ఉంచాలని అధికారులు హెచ్చరించారు.
