Peddapalli Politics : పెద్దపల్లి బీఆర్ఎస్‌లో పీక్స్‌కు రచ్చ.. మాజీ ఎమ్మెల్యే మనోహర్ వర్సెస్ బీసీ లీడర్స్‌..

Peddapalli Politics : పెద్దపల్లి బీఆర్ఎస్‌లో అంతర్గత విభేధాలు రచ్చ రాజేస్తున్నాయ్‌. మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరుపై.. పార్టీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Peddapalli Politics

Peddapalli Politics : పెద్దపల్లి బీఆర్ఎస్‌లో అంతర్గత విభేధాలు రచ్చ రాజేస్తున్నాయ్‌. మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరుపై.. పార్టీ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటి నుంచే పావులు కదుపుతుంటే.. పెద్దపల్లిలో కుమ్ములాట పార్టీ పరువు తీస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్‌.

Also Read : Telangana Politics : ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్ ఫ్యామిలీకి నోటీసులు ఇచ్చే చాన్స్ ఉందా?

మనోహర్ రెడ్డి నేతృత్వంలో ఈ మధ్య బీసీ సెల్ మీటింగ్ జరిగింది.ఐతే బీసీ కీలక నేతలుగా ఉన్న గంట రాములు, దాసరి ఉష, చిరుమల్ల రాకేష్‌ను.. ఈ మీటింగ్‌కు ఆహ్వానించకపోవడం వివాదానికి దారి తీస్తోంది. తమ నాయకులను సమావేశానికి ఎందుకు పిలవలేదని వేదికపైనే వాళ్ల అనుచరులు ప్రశ్నించారు. మూడువర్గాలుగా విడిపోయిన బీసీ నాయకులు.. గొడవకు దిగారు. మనోహర్ వర్గీయులు.. మిగతా బీసీ నాయకులు వర్గీయులపై దాడి చేయడంతో.. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయింది.

బీసీ నాయకుల మీదే కాదు.. మిగతా విషయాల్లోనూ మనోహర్‌ రెడ్డి తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయ్‌. జిల్లా పార్టీ అధ్యక్షుడు, మరో బీసీ నాయకుడు అయిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను కూడా.. మనోహర్ రెడ్డి దూరం పెట్టారట. చందర్‌ కానీ.. ఆయన వర్గీయులు కానీ.. జిల్లా కేంద్రంలో జరిగే ఏదైనా మీటింగ్‌కు వస్తే వారితో గొడవ దిగిన ఘటనలు కూడా ఉన్నాయట. చందర్‌ను కావాలనే బీసీ మీటింగ్‌కు ఆహ్వానించలేదనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో మనోహర్ రెడ్డి తీరుపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి కనిపిస్తోంది.

పెద్దపల్లి బీసీ మీటింగ్‌లో జరిగిన రచ్చపై మాజీ మంత్రి హరీష్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. బీసీ నేతలను కలుపుకొని పోవడంతో.. ఇబ్బంది ఏంటంటూ మనోహర్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్‌. ఇక అటు పెద్దపల్లి బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు.. కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.

పెద్దపల్లి బీఆర్ఎస్‌లో టికెట్‌ పోటీ భారీగా పెరిగింది. మనోహర్ రెడ్డితో పాటుగా బీసీ నాయకులైన గంట రాములు, దాసరి ఉష, చిరుమల్ల రాకేష్ టికెట్ రేసులో కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో దాసరి ఉష.. బీఎస్పీ తరఫున పోటి చేశారు. ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి గులాబీ గూటికి చేరుకున్నారు. ఇక కాంగ్రెస్‌ను విభేదించి బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న గంట రాములు కూడా.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. బీఆర్ఎస్ పెద్దలకు దగ్గర అనే పేరు ఉన్న చిరుమల్ల రాకేశ్‌ కూడా.. ఈసారి పెద్దపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్నారు.

ఇలా పోటీ పెరుగుతుండడంతో.. మనోహర్ రెడ్డిలో అభధ్రత భావం నెలకొందని.. అందుకే కావాలని బీసీ నాయకులను దూరం పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయ్‌. బీసీ నినాదం తన సీటుకే ఎసరు పెడుతుందనే ఆందోళనలో ఆయన ఉన్నట్లు పెద్దపల్లి రాజకీయవర్గాల్లో చర్చ జరగుతోంది. ఏమైనా పెద్దపల్లి బీఆర్ఎస్ పరిణామాలు.. రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయ్‌. హైకమాండ్ ఫోకస్ పెట్టి… ఈ విభేదాలు, వివాదాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.