Kalvakuntla Kavitha : కవిత కొత్త పార్టీ పేరు TRS నా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జాగృతి అధ్యక్షురాలు
Kalvakuntla kavitha : కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ నా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పేరుపై కవిత ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.
- Dharani Pilli
- Published On : April 3, 2026 / 03:10 PM IST
Kalvakuntla kavitha interesting comments on TRS name
Kalvakuntla Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశారు. జాగృతి తరఫున ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే సర్వోదయ తెలంగాణ సాధించేందుకు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలోనే పార్టీ పేరు, జెండా వంటి వివరాలను ప్రకటిస్తానని ఇంతకు ముందే ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు ఇప్పుడు ఫ్రీ అయ్యిందని.. దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి.
తాజాగా కవిత మాట్లాడుతూ.. పాత పేరు, కొత్త అజెండాతో త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పేరు ప్రస్తావించడం కాస్త ఆసక్తికరంగా మారింది. కవిత మాట్లాడుతూ.. ప్రస్తుతం.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు ఫ్రీ అయిందన్నారు. ఇప్పుడు ఎవరైనా సరే ఆ పేరును వాడుకోవచ్చని తెలిపారు. ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే త్వరలో తాను స్థాపించబోయే పార్టీ నడుస్తుందని చెప్పారు. తమ పార్టీకి బిహార్ సిద్ధాంతకర్త అంటూ ఎవరూ లేరన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందంటూ కవిత ఎద్దేవా చేశారు.
కవిత వ్యాఖ్యలను బట్టి చూస్తే తన కొత్త పార్టీకి పాత పేరైనా.. టీఆర్ఎస్ పేరే పెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉద్యమ పార్టీగా.. తెలంగాణ సాధించిన రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పేరుకు ప్రజలతో మంచి అనుబంధం ఉంది. అదే పేరును తన పార్టీకి పెట్టుకుంటే.. సెంటిమెంట్ కలిసి వస్తుందని.. ప్రజల మద్దతు కూడా లభిస్తుందని కవిత భావిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రైవేటు స్కూల్ ఫీజుల పెంపుపై కవిత ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు 30-40 శాతం ఫీజులు పెంచడం సరైంది కాదని.. ఇది మధ్యతరగతి తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందన్నారు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వం ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
