Karimnagar : బీటెక్ విద్యార్థిని ప్రతిభ.. బైక్ యాక్సిడెంట్‌లో తండ్రికి గాయాలు.. సేప్టీ కిట్ రూపకల్పన చేసిన కుమార్తె.. కేంద్రం నుంచి రూ.12లక్షలు!
Karimnagar Student Biker Airbags : కరీంనగర్ తిమ్మపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీచందన.. బైక్ యాక్సిడెంట్‌లో తన తండ్రికి అయిన గాయాలను చూసి చలించిపోయింది.
- Harish Thanniru
- Updated on- May 16, 2026 / 02:26 PM IST
Karimnagar B Tech Student Srichandana Is Designing Airbags For Bikers
Karimnagar : ప్రతిరోజూ ఏదోఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని కారు ప్రమాదాలు కాగా.. కొన్ని బైక్ ప్రమాదాలు ఉంటున్నాయి. కారు ప్రమాదం సమయంలో ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోవడం వల్ల చివరి నిమిషంలో చాలా మంది మృత్యువు నుంచి బయటపడుతున్నారు. బైక్ పై వెళ్లే వారు మాత్రం చివరి నిమిషంలో ప్రాణాలను రక్షించుకోలేక పోతున్నారు. కొంత మంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడుతున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి పెర్కరి శ్రీచందన తండ్రి కూడా బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, తండ్రికి అయిన గాయాలే విద్యార్థి శ్రీచందనను కొత్త ఆవిష్కరణల వైపు నడిపించింది.
Als0 Read : తెలంగాణలోని ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారంలో ఐదు రోజులే పనిదినాలు..!
కరీంనగర్ తిమ్మపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీచందన.. బైక్ యాక్సిడెంట్‌లో తన తండ్రికి అయిన గాయాలను చూసి చలించిపోయింది. ఆ సమయంలో కారు యాక్సిడెంట్ అయితే ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకుని ప్రయాణికులు బయటపడినట్లుగానే.. బైక్ పై వెళ్లే వారికి ఎయిర్ బ్యాగులు తయారు చేస్తే ఎలా ఉంటుందని శ్రీచందన ఆలోచించింది. అనుకున్నట్లుగానే స్మార్ట్ వేరియబుల్ ఎయిర్ బ్యాగ్ సిస్టం ఫర్ టూ వీలర్ రైడర్ సేఫ్టీ అనే అంశంపై పేపర్ వర్క్ చేసింది.
మినిస్ట్రీ ఆప్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) ఐడియా హ్యాకథాన్ 5.0లో శ్రీచందన ప్రశంసలు అందుకుంది. ఎంఎస్ఎంఈ నోటిఫికేషన్‌కు దేశ వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, సైంటిస్టులు, అధ్యాపకులు తమ ప్రజెంటేషన్‌లను పంపించారు. ఇన్నోవేటివ్ ఐడియాలతో ఉన్న 502 మందిని మాత్రమే ఎంపిక చేశారు. వీరిలో తెలంగాణ నుంచి పదుల సంఖ్యలో ఉండగా శ్రీచందన ఒకరు. శ్రీచందన ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 12లక్షల గ్రాంట్ ను సైతం మంజూరు చేసింది.
ఎయిర్ బ్యాగ్ ఎలా పనిచేస్తుందంటే..
శ్రీచందన్ రూపకల్పన చేసే ఎయిర్ బ్యాగ్‌లో బైక్ రైడర్ కోసం జాకెట్ లేదా ప్రత్యేకంగా రూపొందించిన కోటులో బెలూన్లు అమరుస్తారు. బైకర్ హెల్మెంట్‌తోపాటు ఈ జాకెట్ ధరిస్తే యాక్సిడెంట్ సమయంలో కిందపడినప్పుడు వెంటనే బెలూన్స్ తెరుచుకుని బైకర్ కు రక్షణగా నిలుస్తాయి. హెల్మెట్ ఎలాగైతే తలకు రక్షణగా ఉంటుందో అలాగే శరీరమంతటికీ కవర్ అయ్యేలా ఈ జాకెట్ ను రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే బైక్ రైడర్ల మరణాలు, క్షతగాత్రుల సంఖ్య గణనీయంగా తగ్గనుందని భావిస్తున్నారు.
