ఎకరం రూ.204 కోట్లు.. భూముల వేలంలో భారీ ట్విస్ట్.. అవి మా భూములే అంటూ కోర్టుకి..
హైదరాబాద్(SBI Land Dispute) ఐటీ హబ్ ఐకాన్‌గా మారిన రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని అత్యంత ఖరీదైన భూమి వేలం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది.
- V Santhosh Kumar
- Updated on- June 18, 2026 / 11:31 AM IST
Knowledge city raidurg land dispute_ Sbi files petition against telangana government
- నాలెడ్జ్ సిటీ భూవేలంపై ఎస్‌బీఐ దావా.
- వేలాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్.
- ఎకరా రికార్డు స్థాయిలో రూ.204 కోట్లు.
SBI Land Dispute: హైదరాబాద్ ఐటీ హబ్ ఐకాన్‌గా మారిన రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని అత్యంత ఖరీదైన భూమి వేలం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల నగదీకరణ కార్యక్రమంలో భాగంగా గత నెలలో వేలం వేసిన ఐదెకరాల స్థలంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హక్కులను క్లెయిమ్ చేస్తూ చట్టపరమైన పోరాటానికి దిగింది. ఏకంగా వెయ్యి కోట్లకు పైగా పలికిన ఈ ప్రభుత్వ భూమి వేలాన్ని సవాలు చేస్తూ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ హైకోర్టు మెట్లు ఎక్కడం ఇప్పుడు వ్యాపార, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో గల ప్లాట్ నంబర్ 1Aలో ఎస్‌బీఐ తమ ప్రతిపాదిత ట్విన్ టవర్స్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మించాలని భావించింది. అయితే, ఈ నిర్మాణ పనులకు సంబంధించి అదనపు సమయం కావాలని బ్యాంక్ కోరగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు నిరాకరించింది. ఆ తర్వాత తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (SBI Land Dispute) వేగంగా అడుగులు వేస్తూ ఆ భూమిని స్వాధీనం చేసుకుని, వేలానికి ఉంచడాన్ని తప్పుబడుతూ ఎస్‌బీఐ హైకోర్టులో రెండు రిట్ పిటిషన్లను దాఖలు చేసింది. మంగళవారం జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్ కుమార్ ఎదుట లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా ఈ వ్యవహారం విచారణకు వచ్చింది.
వివాదాస్పదమైన ఈ 5.09 ఎకరాల భూభాగాన్ని టీజీఐఐసీ జూన్ 1న నిర్వహించిన బహిరంగ వేలంలో విక్రయించింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ. 1,038.36 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. ఇక్కడ ఎకరా భూమి ధర రికార్డు స్థాయిలో సుమారు రూ. 204 కోట్లు పలకడం గమనార్హం. ఒకవైపు వందల కోట్ల విలువైన డీల్ ముగిసిందని భావిస్తున్న తరుణంలో, ఎస్‌బీఐ కోర్టును ఆశ్రయించడంతో ఈ భూమి భవిష్యత్తు, అక్కడ రాబోయే మెగా ప్రాజెక్టుల నిర్మాణంపై ఉత్కంఠ నెలకొంది.
