Komatireddy Rajagopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అస్సలు తగ్గట్లేదు. వేదిక ఏదైనా సందర్భం మరేదైనా..ప్రతి నిమిషం తన మంత్రి పదవి చుట్టే రాజకీయం తిప్పుతున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తూ ఇచ్చిపడేస్తున్నారు. అమాత్య యోగం ఆమాడ దూరం అన్నట్లు..మంత్రి పదవి దక్కట్లేదన్న ఫ్రస్ట్రేషన్ ఆయనలో పీక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడంతో మంచి ఊపుమీద ఉన్న కాంగ్రెస్‌లో..ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజే..మునుగోడులో ప్రజల మధ్యే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి..లేదంటే నేరుగా ముఖ్యమంత్రి పదవిపైనే గురి పెడుతా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
మంత్రి పదవి దక్కట్లేదని చాలా కాలం నుంచి రాజగోపాల్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సందర్భంలో..ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రెండు సార్లు తనకు పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇస్తామని హామి ఇచ్చినట్లు చెబుతున్నారు. తనకు అమాత్యం యోగం దక్కకుండా ఏదో పెద్ద శక్తే అడ్డుపడుతుందని అనుమానిస్తున్న రాజ్గోపాల్‌రెడ్డి..ఎప్పటికప్పుడు తన ఫ్రస్ట్రేషన్‌ను వెళ్లగక్కుతున్నారు.
Also Read: బద్వేలు టీడీపీ ఇంఛార్జ్ మార్పు లాంఛనమేనా? ఎందుకంటే?
లేటెస్ట్‌గా మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేస్తూ..రాబోయే మరో ఐదేళ్లు కూడా తానే సీఎం అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్‌ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుపడుతున్నారు. రేవంత్ రెడ్డి నెక్ట్స్ సీఎంగా ఏ పార్టీ నుంచి అవుతారంటూ హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆసక్తిరేపుతోంది.
తామంతా కష్టపడితే సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డి..ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. 140 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో నేనే కాబోయే ముఖ్యమంత్రినని ఎవరూ చెప్పుకోలేదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నది టీడీపీ కాంగ్రెస్సా.? రాహుల్ గాంధీ కాంగ్రెస్సా.? నేనే పదేళ్లు సీఎం అని చెప్పుకోవడమంటే..రాహుల్ గాంధీని అవమానించడమే అని అన్నారు.
ఆంధ్ర పెత్తనమే నడుస్తుందంటూ ఫైర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ఇప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు మనుషులు, ఆంధ్ర పెత్తనమే నడుస్తుందంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారంటూ మాట్లాడారు. ఇలా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి..నేనే రాజు, నేనే మంత్రి అని చేసిన కామెంట్స్‌పై క్యాబినెట్ మినిస్టర్లు ఎవరూ రియాక్ట్ కాకపోగా ..ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే కాదు..గతంలో కూడా రెండు, మూడుసార్లు సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా మాట్లాడారు. పదేళ్లు ముఖ్యమంత్రిని అంటూ రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న వ్యాఖ్యలకు గతంలోనూ రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ముందే తనకీ పదవి అని చెప్పుకునే సాంప్రదాయం లేదని.. పార్టీ విధానానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ తప్పుపడుతున్నారు.
మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తే కారణం?
ఓ సారి సీఎంను..ఇంకోసారి ప్రభుత్వ తీరును తప్పుబడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా ఛాన్స్ దొరికిన ప్రతిసారి రాజగోపాల్‌రెడ్డి కన్నెర్ర చేయడానికి కారణం..మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తే అంటున్నారు. మంత్రి పదవి విషయంలో ఢిల్లీ అధిష్టానం అంతా సానుకూలంగా ఉన్నా..సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి రగిలిపోతున్నారట.
ఆ ఫ్రస్ట్రేషన్‌లో భాగంగానే ఆయన అప్పుడప్పుడు హాట్ కామెంట్స్ చేసి చర్చకు దారితీస్తున్నారట. మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లాన్-బి అమలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం కుర్చీకి టార్గెట్ పెడితే..మంత్రి పదవి అయినా దక్కకపోదా అనే ఆలోచనలో రాజగోపాల్ రెడ్డి ఉన్నారట. అందుకే మంత్రి పదవి ఇవ్వకపోతే నేరుగా సీఎం కుర్చీ టార్గెట్ అని చెబుతున్నారట. రాజగోపాల్ రెడ్డి ప్లాన్-బి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.