KTR-Revanth Reddy : మీ ఆస్తులు.. మా ఆస్తులు.. సిట్టింగ్ జడ్జితో తేల్చేద్దామా? రేవంత్‌కు కేటీఆర్ సవాల్
KTR-Revanth Reddy : తమ ఆస్తులు, రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని కేటీఆర్ సవాల్ చేశారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా-ఈ కేసులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.
- Sreehari A
- Published on- October 1, 2026 / 04:07 PM IST
KTR-Revanth Reddy
- 2009లో ఎన్నికల అఫ్డవిట్ లో నా ఆస్తులు పేర్కొన్నా
- 2006లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లోనే హోటల్ పెట్టుకున్నా
- సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు మేం సిద్ధం
- మాది తప్పని తేలితే ఏ శిక్షకైనా నేను సిద్ధం
KTR-Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం మరోసారి తీవ్రస్థాయికి చేరింది. తమ ఆస్తుల నుంచి రేవంత్ రెడ్డి కుటుంబ ఆస్తుల వరకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ సవాల్ చేశారు. తమది తప్పని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తన ఆస్తులపై రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై స్పందించిన కేటీఆర్.. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే తాను హోటల్ ఏర్పాటు చేశానని తెలిపారు. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించానని చెప్పారు. తన హోటల్‌కు ప్రచారం కల్పించినందుకు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
రేవంత్ సోదరుల ఆస్తులపై కేటీఆర్ ప్రశ్న :
తమ కుటుంబానికి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నలు వేస్తున్నారని, చింతమడకలో తమ తాతకు వందల ఎకరాల భూమి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి సోదరుల ఆస్తులపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. 9వ తరగతి చదివిన కొండల్ రెడ్డి ఏరోస్పేస్ సంస్థకు యజమాని ఎలా అయ్యారంటూ ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ కమిషన్ వేశారని, విద్యుత్ కొనుగోళ్లపై కూడా కమిషన్ ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. ఫార్ములా-ఈ వ్యవహారంలో కేసు పెట్టారని, వీటిపై ఇప్పటివరకు ఏం తేల్చారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో 34 మంది చేనేత కార్మికులు చనిపోయారని కేటీఆర్ ఆరోపించారు. వారికి లక్ష రూపాయల పరిహారం ఇస్తారని భావించామని అన్నారు. ‘నల్లమల పులి’ అంటూ రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ, 4వేల మంది పోలీసులను పెట్టుకుని వెళ్లే వ్యక్తి నల్లమల పులి ఎలా అవుతారని ప్రశ్నించారు.
చంద్రబాబు వద్ద ఆయన పిల్లిలా ఉన్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా వచ్చారా? సోషల్ మీడియాలో రీల్స్ పెట్టుకోవడానికి వచ్చారా? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా తన ఫ్రస్ట్రేషన్ ఏమిటని నిలదీశారు.
మోదీ హామీలు అమలు కాలేదు :
కేంద్రంలో మోదీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. ‘అమ్మ విలువ, అన్నం విలువ లేనప్పుడే తెలుస్తుంది’ అని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో కాలు పెడితే ఆ పార్టీ నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీశారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా ఖతం పట్టిస్తారని అన్నారు.
ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి, మంచివాడు :
తన తండ్రి కేసీఆర్ 43 ఏళ్లుగా చట్టసభల్లో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి, మంచివాడని, 1983లో తన తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని గుర్తుచేశారు. తనపై ఒక భాషలో విమర్శలు చేస్తే నాలుగు భాషల్లో సమాధానం చెప్పగలమని, రేవంత్ రెడ్డి విమర్శించినా తాము స్పందిస్తూనే ఉంటామని అన్నారు. కాంగ్రెస్ నేతలను ‘బట్టలూడదీసి కొట్టే రోజు దగ్గరలో ఉంది’ అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
