PMJ Jewellery Store in Karimnagar : కస్టమర్స్‌లా వచ్చి.. కాల్పులు జరిపి.. సిబ్బందిని మోకాళ్లపై కూర్చోబెట్టి.. కట్టేసి.. పీఎంజే జ్యువెలరీ షాపులో భారీ దోపిడీ..
Karimnagar : కరీంనగర్‌లోని పీఎంజే జ్యూవెలరీ షాపులోకి కస్టమర్స్‌లా వచ్చిన ఐదుగురు దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. షాపులోని సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపి.. వారిని తాళ్లతో కట్టేసి భారీ మొత్తంలో బంగారాన్ని దోచుకెళ్లారు.
- Harish Thanniru
- Published on- May 3, 2026 / 02:42 PM IST
massive robbery took place at jewelry shop in Karimnagar
PMJ Jewellery Store in Karimnagar : కరీంనగర్ లో ఆదివారం ఉదయం దొంగల ముఠా రెచ్చిపోయింది. జ్యోతినగర్ లోని పీఎంజే జ్యూవెలరీ షాపులో కస్టమర్స్ లా వచ్చిన ఐదుగురు దుండగులు.. షాపులోని వారిని బెదిరించి.. వారిపై కాల్పులు జరిపి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ దుండగుల కాల్పుల్లో నలుగురి సిబ్బందికి గాయాలయ్యాయి. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిని సిబ్బందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సీసీ కెమెరాల్లో దొంగల దోపిడీకి పాల్పడిన దృశ్యాలు రికార్డయ్యాయి.
ఆదివారం ఉదయం 10గంటలకు షాపును సిబ్బంది ఓపెన్ చేశారు. లాకర్ లో ఉన్న బంగారు ఆభరణాలను డిస్ ప్లే పెడుతుండగా.. ఉదయం 10.30 గంటలకు ఐదుగురు దుండగులు షాపులోకి కస్టమర్స్‌లా వచ్చారు. షాపులో కొద్దిసేపు అటూఇటూ తిరిగారు. కొద్దిసేపటికే సిబ్బందిని బెదిరించి.. వారిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో జ్యూవెలరీలో సుమారు 20 నిమిషాలపాటు పెనుగులాట జరిగింది. దొంగలను అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై కాల్పులు జరిపారు. షాపులో సిబ్బందిని మోకాళ్లపై కూర్చోబెట్టి, కొందరిని తాళ్లతో కట్టేశారు.. తుపాకీతో బెదిరించారు. ఈ సమయంలోనే షాపులోని నగలను దోచుకొని 11.10గంటలకు షాపు నుంచి పరారయ్యారు.
దోపిడీ జరిగిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. షాపులో దోపిడీ జరిగిన తీరును పరిశీలించారు. సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. దుండగులు ముందుగానే రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
