Tamilnadu Elections Results : తమిళనాడులో అధికారం విజయ్‌దేనా? తాజా సర్వేలో సంచలన విషయాలు.. రిసార్ట్ పాలిటిక్స్ షురూ..
Tamilnadu Elections Results : మాజీ ఐపీఎస్ పి.రవి బృందం సర్వేతోపాటు యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు టీవీకేకు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో టీవీకే అధినేత విజయ్ రిసార్ట్ పాలిటిక్స్ కు తెరలేపారు..
Tamilnadu Elections Results
Tamilnadu Elections Results : తమిళనాడు రాష్ట్రంలో సోమవారం బిగ్ డేగా మారనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఏప్రిల్ 23న పోలింగ్ జరిగింది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 85శాతానికిపైగా ఓటింగ్ నమోదు కావడంతో.. ఈ భారీ ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా మారుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ గెలుపుపై డీఎంకే, టీవీకే ధీమాగా ఉన్నాయి.
Also Read : Gold And Silver Rates : బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన రేటు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందని అత్యధిక శాతం సర్వే సంస్థలు వెల్లడించాయి. అయితే, యాక్సిస్ మై ఇండియా, మరికొన్ని స్థానిక చిన్న సంస్థలు, సామాజిక మాధ్యమాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే) వైపే ప్రజలు మొగ్గుచూపారని స్పష్టం చేస్తున్నాయి. అయితే, తాజాగా.. ఓ సంచలన సర్వే తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయ్ పార్టీ 121 స్థానాల్లో విజయం సాధించబోతుందని ఆ సర్వే సంస్థ చెప్పుకొచ్చింది.
మాజీ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం నిర్వహించిన నియోజకవర్గాల వారీగా ఎగ్జిట్ పోల్ సర్వేలో విజయ్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేస్తుందని చెప్పింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే 41శాతం ఓట్లతో 121కిపైగా స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ఆ సర్వే బృందం వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం యువతేనని తెలిపింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడాలేకుండా యువత భారీ సంఖ్యలో టీవీకే వైపు మొగ్గుచూపారని, దీంతో విజయ్ పూర్తి మెజార్టీతో అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పి. రవి బృందం పేర్కొంది.
మాజీ ఐపీఎస్ పి. రవి బృందం సర్వేతోపాటు యాక్సిస్ మై ఇండియా సర్వే ఫలితాలు టీవీకేకు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే క్రమంలో హంగ్ కూడా వస్తుందని, టీవీకే కింగ్ మేకర్ అవుతుందని పలు సర్వే సంస్థలు చెప్పుకొచ్చాయి. ఈ నేపథ్యంలో విజయ్ అప్రమత్తమయ్యారు. రిసార్ట్ పాలిటిక్స్ కు తెరతీశారు. మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో ఉన్న ఒక ప్రైవేట్ రిసార్ట్ లో సుమారు 100 మందికిపైగా గెలిచిన అభ్యర్థులకు వసతి కల్పించేందుకు టీవీకే పార్టీ ఏర్పాట్లు చేసింది.
ఫలితాలు ప్రకటించిన వెంటనే విజయం సాధించిన అభ్యర్థులంతా క్షణం కూడా ఆలస్యం చేయకుండా పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని విజయ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుంచి వారిని రిసార్ట్ కు తరలించనున్నారు. అంతేకాకుండా, గెలిచిన తర్వాత ఎక్కడికీ వెళ్లొద్దని అభ్యర్థులతో జరిగిన సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మొత్తానికి సోమవారం వెల్లడయ్యే ఫలితాల్లో టీవీకే పార్టీ విజయం సాధిస్తుందని, లేదంటే తమిళనాడు రాజకీయాల్లో కింగ్ మేకర్ గా ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. విజయ్, టీవీకే నేతల అంచనాలు ఏమేరకు ఫలిస్తాయో.. ఏ సంస్థ సర్వే ఫలితాలు నిజమవుతాయో సోమవారం మధ్యాహ్నం వరకు తేలిపోనుంది.
