TG 10th Result Girl Suicide : అయ్యో సాయి ప్రియ వారం రోజులు ఆగితే ఎంత బాగుండేది తల్లి.. 480 మార్కులతో

TG 10th Result Girl Suicide : పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినిక 480 మార్కులు వచ్చాయి.

medak girl student ends her life before ts ssc 10th results 2026 she passes with 480 marks

  • మెదక్ లో తీవ్ర విషాదం
  • పదోతరగతిలో ఫెయిల్ అవుతాననే భయంతో
  • రిజల్ట్ కు వారం రోజుల ముందు బాలిక ఆత్మహత్య

TG 10th Result Girl Suicide : మార్కులు, గ్రేడ్లే లోకంగా పిల్లలను పరుగులు తీయిస్తున్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఫెయిలైతేనో లేక తక్కువ మార్కులు వస్తేనో అసలు జీవితమే లేదనే భయాన్ని పిల్లల నరానరాల్లో ఎక్కిస్తున్నాం. ఫలితంగా మార్కులు తక్కువ వచ్చాయనో లేదా ఫెయిల్ అవుతామన్న ఆందోళనతోనో.. తల్లిదండ్రులు, బంధువుల ముందు తలెత్తుకోలేక.. అభం శుభం తెలియని చిన్నారులు పట్టుమని 15 ఏళ్లు కూడా నిండకుండానే ఆత్మహత్య చేసుకొని పరలోకానికి పయనం అవుతున్నారు.

తాజాగా మెదక్ జిల్లాలో జరిగిన ఓ దారుణం, సమాజంలో మార్కులనే పెనుభూతం ఎంతలా పాతుకుపోయిందో, అది పిల్లలపై ఎంతటి దారుణ ప్రభావం చూపుతుందో తెలియజేస్తోంది. ఫలితాలు వెల్లడి కాకముందే.. తాను ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇక్కడ అన్నింటికన్నా విషాదకరమైన విషయం ఏంటంటే.. నిన్న వెల్లడించిన తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో ఆ బాలిక 480 మార్కులతో మంచి గ్రేడ్ సాధించింది. బాలిక మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన బానోత్ సాయిప్రియ పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తోంది. తను కొత్తపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. పరీక్షలు పూర్తయ్యాక.. తాను కొన్ని ఎగ్జామ్స్ సరిగా రాయలేదని ఆందోళన చెందింది. ఈ క్రమంలో ఫలితాలు వచ్చాక తాను ఫెయిల్ అయితే తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేనని భయపడిన సాయిప్రియ దారుణ నిర్ణయం తీసుకుంది.

ఏప్రిల్ 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భయపడి ప్రాణాలు తీసుకున్న సాయిప్రియ.. తాజాగా వెల్లడించిన ఫలితాల్లో 480 మార్కులతో అత్యుత్తమ గ్రేడ్ సాధించింది. బిడ్డ సాధించిన మార్కులు చూసి సంతోషంతో పండుగ చేసుకోవాల్సిన తల్లిదండ్రులు.. కనరాని లోకాలకు వెళ్లిన కుమార్తెను తలచుకుని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. పరీక్షల్లో గెలిచింది కానీ.. ఆమెలో పేరుకుపోయిన భయం ముందు ఓడిపోయింది. కొన్ని రోజులు ధైర్యంగా ఉండుంటే.. సాయిప్రియ బంగారు భవిష్యత్తును చేరుకునేది. కానీ అంతులేని భయంతో ప్రాణాలు తీసుకుంది.

ఫలితాల కంటే ముందే ప్రాణాలు తీసుకోవడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది. “చదువుకోమన్నాం కానీ, ప్రాణాలు తీసుకోమని చెప్పలేదు కదా తల్లి” అంటూ వారు రోదిస్తున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేస్తోంది.