Hyderabad : నేను కొనాలనుకున్న ఇల్లు నువ్వెలా కొంటావ్..? ఇంటిపై దాడి, కార్లు ధ్వంసం! రచ్చరచ్చ

Hyderabad : ఇంటిని కొనలేకపోయానన్న కక్షతో ఓ వ్యక్తి తన అనుచరులతో కలిసి కొత్త ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడిచేసి ఇంటి సామాగ్రితో పాటు వాహనాలను ధ్వంసం చేశాడు.

medipally housewarming ceremony attack 40mens vandalise house cars

  • గృహప్రవేశం వేడుకలో వీరంగం..
  • కుటుంబంపై మూకుమ్మడి దాడి
  • ఇంటి యజమాని, మరో ముగ్గురికి గాయాలు

Hyderabad : ఆనందంగా సాగుతున్న గృహప్రవేశ వేడుక ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఇంటిని కొనలేకపోయానన్న కక్షతో ఓ వ్యక్తి తన అనుచరులతో కలిసి కొత్త ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడిచేసి ఇంటి సామాగ్రితో పాటు వాహనాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Also Read : Rythu Bharosa : ‘రైతు భరోసా’పై మరో బిగ్ అప్డేట్.. రేపే రైతుల ఖాతాల్లోకి రూ.6వేలు.. కానీ, ఈసారి వారికి మాత్రమేనట..

వివరాల్లోకి వెళితే.. అంబర్‌పేటకు చెందిన కుశాల్ బోడుప్పల్‌లోని దేవేందర్ నగర్‌లోఉన్న తన రెండంతస్తుల ఇంటిని విక్రయానికి పెట్టాడు. ఆ ఇంటిని యాకయ్య కొనుగోలు చేయాలని ప్రయత్నించినప్పటికీ ధర విషయంలో ఒప్పందం కుదరలేదు. అనంతరం కుశాల్ ఆ ఇంటిని బండారి అనిత, శ్యామ్‌రావు దంపతులకు విక్రయించాడు. దీంతో వారు శనివారం గృహప్రవేశం వేడుకను ఏర్పాటు చేసుకున్నారు. బంధుమిత్రులు అంతా హాజరయ్యారు. తాను కొనాలనుకున్న ఇంటిని వేరే వ్యక్తి కొనుగోలు చేయడంతోపాటు గృహప్రవేశం చేస్తుండటంతో యాకయ్య జీర్ణించుకోలేక పోయాడు.

రాత్రి మద్యం మత్తులో ఇంటి వద్దకు వచ్చి ఘర్షణకు దిగాడు. నేను కొనాల్సిన ఇంట్లోకి ఎందుకొచ్చారంటూ బండారి అనిత, శ్యామ్‌రావు దంపతులు, వారి బంధువులతో వాగ్వివాదంకు దిగాడు. కుటుంబ సభ్యులు యాకయ్యను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న యాకయ్య కొందరికి ఫోన్ చేశాడు. దీంతో కొద్దిసేపటికే సుమారు 40మంది వరకు అక్కడకు చేరుకొని దాడికి పాల్పడ్డాడు. ఇంటిముందు ఉంచిన వస్తువులు, కార్లు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేస్తూ కనిపించిన వారిని కొట్టారు. గేటు, తలుపులు, అద్దాలు, ఇతర సామాగ్రి ధ్వంసం చేశారు. దాడిని చిత్రీకరించిన వ్యక్తిని చితకబాదారు. ఫోన్ లాక్కొని పగలగొట్టారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా మేడేపల్లి పోలీసులు ఘటన స్థలికి చేరుకోవటంతో నిందితులు పరారయ్యారు. ఈ దాడిలో శ్యామ్‌రావు తీవ్రంగా గాయపడగా.. మరో ముగ్గురు బంధువులకు కూడా గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు వెళ్లిపోయిన కొద్దిసేపటికే మళ్లీ కొందరు వచ్చి కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న మేడేపల్లి పోలీసులు మళ్లీ ఘటన స్థలికి రావడంతో నిందితులు పరారయ్యారు. దీంతో పోలీసులు ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఈ దాడి వ్యూహం వెనుక స్థానికంగా ఉండే ఓ రాజకీయ నేత ప్రమేయం ఉన్నట్లు చర్చ జరుగుతుంది. గతంలో ఆ ఇంటిని తక్కువ ధరకు దక్కించుకునేందుకు అతను ప్రయత్నించగా విఫలం కావడంతోనే ఇలా దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని.. ఆ ఇంట్లోకి ఎవరూ రాకుండా చేస్తే.. తక్కువ ధరకు ఆ ఇంటిని కొనుగోలు చేయొచ్చునని అతను ఇలా చేస్తున్నాడని స్థానికులు చర్చింకుంటున్నారు.