Telangana Rains : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ..
Telangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
- Harish Thanniru
- Published on- August 19, 2026 / 09:51 AM IST
Telangana Rain Alert
Telangana Rains : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వాతావరణ శాఖ వర్షాలపై తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read : Vijayasai Reddy : కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తున్నా.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన.. పార్టీ పేరు ఏమిటంటే?
రాష్ట్రంలోని 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. యాదాద్రి, నారాయణ పేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో వాతావరణం మేఘావృతమై ఉంది. సాయంత్రం, రాత్రి వేళల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం నుంచి పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట, భూపాలపల్లి, హనుమకొండ, కామారెడ్డి, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అంతేకాక.. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఒకవేళ వెళ్లినా.. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగులు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు. గురువారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఏపీలోనూ వర్షాలు దంచికొట్టనున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్డీఆర్, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
