Telangana Rain Alert : బంగాళాఖాతం అల్లకల్లోలం.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ
Telangana Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనంతోపాటు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వచ్చే ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
- Harish Thanniru
- Published on- July 18, 2026 / 07:01 AM IST
Telangana Rain Alert
- తెలంగాణకు వర్ష సూచన
- ఐదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
- హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Telangana Rain Alert : దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. జూన్, జులై నెలల్లో కురవాల్సిన సాధారణ వర్షపాతం కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదు. ముఖ్యంగా తెలంగాణలో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో రైతులు పంటల సాగులో ముందుకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్తను తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఈనెల 22వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Also Read : Anna Lezhneva : కాలి నడకన తిరుమల శ్రీవారి దర్శనానికి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా..
వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా – బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం బలపడింది. కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. అల్పపీడనానికి అనుబంధంగా ఒక ఆవర్తన ద్రోణి కూడా కొనసాగుతున్నందున రాష్ట్రంలో శనివారం నుంచి నాలుగైదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. భీకర గాలులు, ఉరుముల మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని, పలు ప్రాంతాల్లో భీకర గాలులతో తేలిక పాటి వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
హైదరాబాద్ నగరంలోనూ వర్షం దంచికొట్టింది. శుక్రవారం రాత్రి పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం పడగా.. పలు ప్రాంతాల్లో మేఘావృతమై ఉంది. రాబోయే వారం రోజులు పాటు నగరంలోనూ అడపాదడపా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మొత్తంగా అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో ఈనెల 22వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాలు పడుతున్న సమయంలో, ఈదురుగాలులు సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆ సమయాల్లో విద్యుత్ స్తంభాల వద్ద, చెట్ల కింద, హోర్డింగ్ ల వద్ద ఉండొద్దని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో బయటకు వచ్చిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
