Rain Alert : రెయిన్ అలర్ట్.. రెండ్రోజులు ఈ జిల్లాల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకవైపు రికార్డు స్థాయిలో వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Harishth Thanniru
- Published on- April 26, 2026 / 08:18 AM IST
Rain Alert
- తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్
- ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే చాన్స్
- పిడుగులతోపాటు ఈదురు గాలులతో వర్షాలకు అవకాశం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన
Rain Alert : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం కర్నూలు జిల్లా నగరడోనలో గరిష్ఠంగా 44.8డిగ్రీల ఉష్ణోగ్ర నమోదవ్వగా.. రాష్ట్ర వ్యాప్తంగా 172 మండలాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 44డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉదయం 10గంటల తరువాత బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
ఒకవైపు ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాంలో ఏప్రిల్ 28, 29 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవే పరిస్థితులు తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి 29వ తేదీ వరకూ ఉంటాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.
ఇవాళ తెలంగాణలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ, మేఘాల వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం తరువాత పూర్తిస్థాయిలో మేఘాలు వస్తాయి. రాత్రివేళ ఉక్కపోత వాతావరణం ఉంటుంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. ఈ సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలో ివాళ రోజంతా ఎండ, మేఘాల వాతావరణం ఉంటుంది. సాయంత్రం వేళ ఉత్తరాంధ్రలో వర్షం పడే అవకాశం ఉంది. మేఘాలు దట్టంగా కమ్ముకుంటాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ విభాగం అంచనా వేసింది.
ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ వర్షాలకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, ఈదురుగాలులు, వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఇదే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని, ప్రజలు బయటకు వెళ్లే సమయంలో ఎండదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
