Rohini Karte 2026 : రోహిణి కార్తె వచ్చేసింది.. బయటకు వెళ్తే నిప్పుల వర్షమే.. ఈ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ..

Rohini Karte 2026 : రోహిణీ కార్తె కారణంగా తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చినా వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Meteorological Department predicted daytime temperatures will increase in Telangana from today due to Rohini Karte

  • ఇవాళ్టి నుంచి రోహిణీకార్తె
  • ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం
  • అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు

Rohini Karte 2026 : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలాచోట్ల 46 నుంచి 48డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఎండలకు తోడు ఈదరుగాలులు, ఉక్కపోత కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అయితే, ఇవాళ్టి నుంచి రోహిణీ కార్తె ప్రారంభం అవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దని, తప్పనిసరియై బయటకు వెళ్లినా వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read : Petrol Diesel Prices Hiked : వాహనదారులకు బిగ్‌షాక్.. పదిరోజుల్లో నాల్గోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ రేటు.. ఈసారి భారీగా.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే..

రోహిణీ కార్తె సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రోహిణీ కార్తెలో రోళ్లు పగులుతాయని అంటుంటారు. ఆ స్థాయిలో ఎండల తీవ్రత ఉంటుంది. రోహిణీ కార్తె ప్రతీ సంవత్సరం మే25న ప్రారంభమై జూన్ 8వ తేదీ వరకు 14రోజులపాటు ఉంటుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు భూమిపై నిటారుగా పడటం వల్ల ఎండలు అత్యంత తీవ్రంగా ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే, తెలంగాణలో వచ్చే రెండు రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలుజారీ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 10జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిర్మల్‌లలో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడగాలులు తీవ్రంగా వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రిపూట వేడి గాలులు తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. ఈనెల 27 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అంచనా వేసింది. అయితే, రుతుపవనాలు వేగంగా కదులుతుండటంతో వారం రోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

ఏపీలోనూ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లోనే అత్యధికమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావొద్దని సూచించింది.