Rain Alert : రెయిన్ అలర్ట్.. వారంరోజులు ఈ జిల్లాల్లో వానలేవానలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ.. రైతులకు కీలక సూచన

Rain Alert : ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

Rain Alert

  • తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత
  • చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ
  • ఈనెల 16 నుంచి వారంరోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్..

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం 9గంటల దాటితే బయటకు రావాలంటే ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి పరిస్థితి. ఇక మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం సమయంలో ఉక్కపోతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. వాతావరణంలో రానున్న వారంరోజుల్లో మార్పులు వస్తాయని, ఈ కారణంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read : Brs: అందరికీ క్లీన్‌చిట్..! బీఆర్ఎస్ వాట్ నెక్ట్స్..? కోర్టులు అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందా?

ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న తేమ గాలులు, స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వారం రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, అదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో కొన్నిచోట్ల వడగండ్ల వానలు పడే అవకాశం ఉంది. మార్చి 14వ తేదీ వరకు ఎండల తీవ్రత ఉంటుంది. 16వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన జల్లులు పడవచ్చునని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాల నేపథ్యంలో అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వంటి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. మార్చి 16, 17 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ వర్షాల వల్ల ఎండల నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభించే అవకాశం ఉన్నప్పటికీ.. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని.. ఆ సమయాల్లో ప్రజలు చెట్ల కింద, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు ఉండే ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చి సమయం.. ఇలాంటి సమయంలో ఈదురుగాలులు, వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పంటలు పొలాల్లో కోత దశలో ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తుగా పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.