Telangana Rain Alert : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు.. కీలక విషయాన్ని వెల్లడించిన వాతావరణ శాఖ
Telangana Rain Alert : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశాసింది.
- Harishth Thanniru
- Published On : March 13, 2026 / 07:01 AM IST
Telangana Rain Alert
- తెలంగాణకు రెయిన్ అలర్ట్
- 15, 16 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు
- ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
Telangana Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఉదయం 9గంటల దాటితే బయటకు రావాలంటే ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి పరిస్థితి. ఇక మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం సమయంలో ఉక్కపోతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈనెల 15, 16 తేదీల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గురువారం భద్రాచలంలో సాధారణంకన్నా 3.5 డిగ్రీల సెల్సియస్ అధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్ నగర్‌లో 40 డిగ్రీలు, ఖమ్మంలో 30, అదిలాబాద్‌లో 39.3 డిగ్రీల ఉస్ణోగ్రత నమోదైంది. అయితే, వచ్చే నాలుగైదు రోజుల్లో తెలంగాణలో ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఈనెల 15, 16 తేదీల్లో (ఆది, సోమ వారాల్లో) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఎండల తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ (10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం)ను జారీ చేశాసింది. అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది.
ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని.. ఆ సమయాల్లో ప్రజలు చెట్ల కింద, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు ఉండే ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
మరోవైపు.. ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయం.. ఇలాంటి సమయంలో ఈదురుగాలులు, వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పంటలు పొలాల్లో కోత దశలో ఉండగా.. కొన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తుగా పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
