Weather Updates : వాతావరణ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఇంకా ఎన్ని రోజులంటే..

Weather Updates : తెలంగాణలోని ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Telangana Weather Update

Weather Updates : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వర్షాలపై వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ (బుధవారం), రేపు (గురువారం) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Also Read : Rice Prices : ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు.. పీజేటీఏయూ సంచలన నివేదిక ..

బుధవారం అదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా.. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

గురువారం అదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈనెల 31 తేదీన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, బలమైన ఉపరితల గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అధికారులు సూచించారు. ఆగస్టు నెల 5వ తేదీ వరకు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

వర్షాలతోపాటు భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్ననేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, హోర్డింగ్ లు, విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాల్లో వేచి ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.