Rice Prices : ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు.. పీజేటీఏయూ సంచలన నివేదిక ..
El Nino Impact On Global Rice Prices : ఎల్‌నినో ప్రభావంతో ధాన్యం ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాన దిగుమతి దేశాలు ముందస్తుగా భారీగా బియ్యం నిల్వలు చేసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ప్రపంచ బియ్యం ధరలు 30 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) విడుదల చేసిన నివేదిక హెచ్చరించింది.
El Nino Impact On Global Rice Prices
El Nino Impact On Global Rice Prices : ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే అవకాశం లేదని.. దీంతో ఈ ఏడాది కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలుసైతం నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాయి. దీంతో ప్రధానంగా వరి పంటసాగు తగ్గి.. ధాన్యం ఉత్పత్తి భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
ఎల్‌నినో ప్రభావంతో ధాన్యం ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధాన దిగుమతి దేశాలు ముందస్తుగా భారీగా బియ్యం నిల్వలు చేసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ప్రపంచ బియ్యం ధరలు 30 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) విడుదల చేసిన నివేదిక హెచ్చరించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు గత కొన్నేళ్ల కనిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికీ, ఎల్‌నినో ప్రభావం తీవ్రత పెరిగితే ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది.
అధ్యయనం ప్రకారం.. భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, ఎరువులు, ఇంధన ధరల పెరుగుదలతో పాటు ఆసియాలోని ప్రధాన వరి పంట ప్రాంతాలపై ఎల్‌నినో ప్రభావం ప్రపంచ బియ్యం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ప్రస్తుతం సరఫరా పరిస్థితులు అనుకూలంగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ధరల పెరుగుదలకు అనేక ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయని అధ్యయనం పేర్కొంది. ఇందులో ప్రపంచ బియ్యం మార్కెట్‌కు సంబంధించి మూడు పరిస్థితులను వివరించింది.
ఉత్తమ పరిస్థితిలో వరి ఉత్పత్తి స్థిరంగా ఉండి, దేశాలు ఎగుమతులపై ఆంక్షలు విధించకుండా, భయంతో నిల్వలు పెంచుకోకుండా ఉంటే బియ్యం ధరలు 10 నుంచి 20 శాతం వరకు మాత్రమే పెరిగే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. అయితే, అత్యంత సాధ్యమైన పరిస్థితిలో ఎల్‌నినో కారణంగా మోస్తరు స్థాయిలో వరి ఉత్పత్తి తగ్గడం, ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలు ముందస్తు జాగ్రత్తగా బియ్యం నిల్వలు పెంచుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు 30 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అత్యంత ప్రతికూల పరిస్థితిలో వరి ఉత్పత్తిలో తీవ్ర నష్టం, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులపై ఆంక్షలు, భయంతో భారీగా బియ్యం కొనుగోళ్లు జరిగితే ప్రపంచ బియ్యం ధరలు 100శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరిగే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరించింది.
ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రమైతే అంతర్జాతీయ సహకారం, పారదర్శక వాణిజ్య విధానాలు, సకాలంలో మార్కెట్ సమాచారాన్ని పంచుకోవడం ద్వారా మాత్రమే బియ్యం మార్కెట్‌ను స్థిరంగా ఉంచవచ్చని అధ్యయనం సూచించింది. అలాగే ప్రపంచ బియ్యం ఉత్పత్తి, ఎగుమతులు, ప్రభుత్వ ధాన్య నిల్వల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తున్నందున, దేశీయ అవసరాల పేరుతో భారత్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే ప్రపంచ మార్కెట్లో ధరల పెరుగుదల మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది.
